ప్రేమజంటను చంపిన తల్లిదండ్రులు అరెస్ట్
ధోలాపూర్: పరువు హత్యలకు పాల్పడ్డ కేసులో దంపతులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పరువు హత్యల ఘటన రాజస్థాన్లోని ధోలాపూర్లో సంచలనం సృష్టించిన విషయం అందరికీ విదితమే. పోలీసుల కథనం ప్రకారం... నరేశ్ ఠాకూర్(21), భారతి కుశ్వాహ(19)లు గత ఎనిమిది నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయాన్ని భారతి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. తమ కులాలు వేరని కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలనుకున్న ఆ జంటకు నిరాశే ఎదురైంది. తల్లిదండ్రులు వారిస్తున్నప్పటికీ, భారతి తన ప్రియుడిని తరచూ కలుస్తుండేది.
కూతురి ప్రవర్తనతో ఆవేశానికి లోనైన ఆమె తల్లిదండ్రులు గిరిరాజ్, జల్దేవిలు తమ అల్లుడు శైలేంద్రతో కలిసి ప్రేమజంటను హత్య చేసేందుకు కుట్రపన్నారు. అమ్మాయి బావ ఆ జంటకు పెళ్లి చేస్తామని చెప్పి వారిద్దరని ఓ ప్రాంతానికి పిలిపించాడు. అప్పటికే ఆ ప్రాంతంలో అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ధోలాపూర్ సమీపంలోని నాగ్ల గ్రామంలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి తమ పథకం ప్రకారం వారిని గొంతు నులిమి హత్యచేశాడు. ఈ పరువు హత్యకు పాల్పడినందుకు అమ్మాయి తల్లిదండ్రులను అరెస్టు చేసినట్లు ధోలాపూర్ ఎస్పీ రాజేష్ సింగ్ తెలిపారు. మరో నిందితుడు శైలేంద్ర ప్రస్తుతం పరారీలో ఉన్నాడని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.