చెల్లి తల నరికి.. ఊరేగించారు
లక్నో: పరువు హత్యతో ఉత్తర ప్రదేశ్లోని షాహజాన్ పూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తమ కుటుంబం పరువుకు భంగం కలిగించిందనే కోపంతో తోడబుట్టిన చెల్లిని.... ఇద్దరు సోదరులు క్రూరంగా నరికి చంపేశారు. అంతేకాకుండా నరికిన తలతో వారిద్దరూ వీధుల్లో అరుచుకుంటూ బీభత్సం సృష్టించారు. బహమనీ పంచాయతీ పరిధిలోని పరౌరా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే ...ఫూల్ జెహాన్(17) బాలిక, మహమ్మద్ అచ్చన్ను ప్రేమించింది. ఈ ప్రేమ వ్యవహారం తెలిసి వరుసకు సోదరులు అయిన గుల్ హసన్, నాన్హే మియాన్ ఆగ్రహానికి లోనయ్యారు. అందరూ చూస్తుండగానే గ్రామ నడివీధిలో ఫూల్ జెహాన్ తలను అతి దారుణంగా నరికేశారు. తరువాత మొండాన్ని అక్కడే వదిలేసి, తెగిపడిన తల భాగాన్ని పట్టుకొని వీధుల్లో అరుచుకుంటూ తిరిగారు.
తమ కుటుంబాల్లో ఇంకెవ్వరూ ఇటువంటి పరువు తక్కువ పని చేయరాదంటూ హెచ్చరించారు. తమ చర్య అమ్మాయిలందరికీ గుణపాఠం కావాలంటూ వారిద్దరూ ఉన్మాదంతో ఊగిపోయారు. తాము సరైన శిక్ష విధించామంటూ ఆవేశంతో రెచ్చిపోతూ ఊరంతా కలియదిరిగారు. క్రైమ్ సినిమాలను తలపించే ఆ దృశ్యాన్ని కళ్లారా చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోయారు.అయితే ఇంత దారుణం జరుగుతున్నా స్థానిక పోలీసులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పైగా ప్రేమికుడు అచ్చన్ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా ఎనిమిది మంది సోదరులు ఉన్న కుటుంబంలో ఫూల్ జెహాన్ ఒక్కతే ఆడపిల్ల. ఆరుగురు ఢిల్లీలో నివసిస్తున్నట్టు సమాచారం. ఈ సంఘటన తరువాత బాలిక తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. అయితే నిందితులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బబ్లూ కుమార్ తెలిపారు. గ్రామంలోఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రత్యేక బలగాలను తరలించినట్లు చెప్పారు.