నవంబర్ 24 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్నాయి. పలు బిల్లుల ఎజెండాతో 30 రోజులపాటు సాగే సెషన్‌లో 22 సార్లు పార్లమెంట్ భేటీ కానుంది. ప్రైవేటు సభ్యుల బిల్లుల కోసం నాలుగు రోజులు కేటాయించనున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారమిక్కడ సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ షెడ్యూలును ఖరారు చేసింది.తర్వాత షెడ్యూలును ఆమోదించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేసింది. కేబినెట్ కమిటీ భేటీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతోపాటు ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న 67 బిల్లుల్లో(లోక్‌సభలో 8, రాజ్యసభలో 59 బిల్లులు) 35 బిల్లులను ఆమోదం కోసం చేపడతారు.
ఆర్థిక బిల్లులకు సమయం కేటాయించ ండి
పార్లమెంటులో ముఖ్యమైన ఆర్థిక బిల్లులపై చర్చకు తగినంత సమయం దొరకడం లేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు మార్గాలు అన్వేషించాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను సూచించారు. ఆయన సోమవారమిక్కడ అకౌంటెంట్స్ జనరల్ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. మొదటి నాలుగు లోక్‌సభలతో పోలిస్తే తర్వాత లోక్‌సభలు ఆర్థిక బిల్లులకు తక్కువ సమయం కేటాయించాయన్నారు.డబ్బులు కేటాయించి పన్ను విధిస్తున్న పార్లమెంటు ఆర్థిక విషయాలకు తగిన సమయం కేటాయించడం లేదంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమిత్ర దృష్టికి తీసుకొచ్చారు. సుమిత్ర మాట్లాడుతూ.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) విమర్శలనే కాకుండా సంబంధిత సంస్థల విజయాలను కూడా గుర్తించాలని ప్రణబ్ అన్నారు.