
విమానంలో దుస్తులు విప్పేసి.. గొడవ
భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు నీచంగా ప్రవర్తించాడు. ప్రయాణంలో ఉండగా.. బాత్రూంలోకి వెళ్లి అక్కడ దుస్తులు మొత్తం విప్పేసి నానా హంగామా సృష్టించాడు. తొలుత విమానం ఎక్కి సీటులో కూర్చోగానే తనకు సీటుబెల్టు కట్టుకోవడం ఎలాగో తెలియదని చెప్పాడు. దాంతో విమాన సిబ్బంది ఆ విషయంలో అతడికి సాయం చేశారు. తర్వాత అతడు బాత్రూంకు వెళ్లి.. అక్కడ ఉన్న కాల్ బెల్ కొట్టి, సాయం కావాలని సిబ్బందిని పిలిచాడు. వెంటనే సిబ్బంది అక్కడకు వెళ్లి చూడగా.. అతడు దుస్తులన్నీ విప్పేసి అభ్యంతరకర పరిస్థితిలో కనిపించాడు. దాంతో లోపలకు వెళ్లేందుకు నిరాకరించిన మహిళా సిబ్బంది.. అతడిని కాస్త గౌరవప్రదంగా ప్రవర్తించాలని చెప్పారు.
తర్వాత ఎలాగోలా బయటకు వచ్చిన ప్రయాణికుడు.. ఆ తర్వాత కూడా తన దుష్ప్రవర్తన మానుకోలేదు. ప్రయాణికులంతా విమానం నుంచి దిగేటప్పుడు మహిళా సిబ్బందిపై అతడు దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. దాంతో విమాన కెప్టెన్‌కు సిబ్బంది ఈ విషయం వెల్లడించగా, కెప్టెన్ వెంటనే ఢిల్లీలోని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సదరు ప్రయాణికుడు కిందకు దిగగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఢిల్లీలోని ఒక పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు. ప్రయాణికుల సంతృప్తి తమ ప్రధాన లక్ష్యమని.. అయితే ఎవరైనా ఇలా అనుచితంగా ప్రవర్తిస్తే మాత్రం ితర ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా తాము స్పందించాల్సి ఉంటుందని ఇండిగో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇలా అనుచితంగా ప్రవర్తించేవాళ్లను నియంత్రించడానికి కొన్ని విమానయాన సంస్థలు ప్లాస్టిక్ బేడీలు కూడా విమానాల్లో ఉంచుకుంటున్నాయి. విమాన భద్రతకు ముప్పు వాటిల్లే సందర్భంలో తాము ఏమాత్రం ఊరుకునేది లేదని విమానయాన సంస్థలన్నీ ఇప్పటికే స్పష్టం చేశాయి. అలాంటివారిని పోలీసులకు అప్పగిస్తామని తెలిపాయి.