వారం రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ!
పాస్‌పోర్టు పొందాలంటే చాలా కష్టం. అందుకు ముందు దరఖాస్తు చేయాలి, తర్వాత పోలీసు వెరిఫికేషన్ అవ్వాలి, ఆ తర్వాత పాస్‌పోర్టు మంజూరు కావాలి, అది మనకు చేరాలి. ఇదంతా అవ్వాలంటే ఎంత లేదన్నా నెల రెండు నెలల సమయం పడుతుంది. కానీ.. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం పుణ్యమాని వారం రోజుల్లోనే పాస్‌పోర్టు చేతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేవలం మూడు రకాల పత్రాలు దాఖలు చేస్తే చాలు.. వారంలో పాస్‌పోర్టు వచ్చేస్తుందని చెబుతున్నారు. అది కూడా తత్కాల్ కాదు.. సాధారణ పద్ధతిలోనే! ఆధార్ కార్డు కాపీ, ఓటరు గుర్తింపు కార్డు కాపీ, పాన్ కార్డు కాపీ.. ఈ మూడింటితో పాటు పౌరసత్వం, కుటుంబ వివరాలు, నేర రికార్డులు లేవన్న డిక్లరేషన్‌తో కూడిన అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా పాస్‌పోర్టుల జారీ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం పోలీసు వెరిఫికేషన్. అయితే ఇలాంటి వాటికి మాత్రం పాస్‌పోర్టు జారీ అయిన తర్వాత ఈ వెరిఫికేషన్ చేస్తారు. అందుకు అదనపు చార్జీ ఏమీ వసూలు చేయరు. ముందుగా ఆధార్ నెంబరును ఆన్‌లైన్‌లో తనిఖీ చేస్తారు. దీనికితోడు ఓటరు కార్డు, పాన్ కార్డు కూడా తనిఖీ చేస్తారు. ఒకవేళ పోలీసు తనిఖీలో నివేదిక భిన్నంగా వస్తే.. అప్పుడు పాస్‌పోర్టును వెనక్కి తీసుకుంటారు.
భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండానే పాస్‌పోర్టు జారీ ప్రక్రియను సులభతరం చేయడానికే ఇలా చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖలో పాస్‌పోర్టు విభాగం డైరెక్టర్ అనిల్ కుమార్ సోబ్తి తెలిపారు. ఆధార్ డేటాబేస్ సిద్ధంగా ఉన్నందువల్ల దాని ఆధారంగా అప్పటికప్పుడే మొత్తం తనిఖీ చేసుకోవచ్చని, అదికూడా దరఖాస్తు చేసేవాళ్లు పాస్‌పోర్టు సేవాకేంద్రం దగ్గర ఉండగానే అయిపోతుందని ఆయన చెప్పారు. దరఖాస్తుదారులు వివరాలన్నింటినీ కచ్చితంగా ఇస్తే.. ఆ తర్వాత పోలీసు వెరిఫికేషన్‌లో నివేదిక భిన్నంగా ఉండే ప్రమాదం తప్పుతుందని అన్నారు.