హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ కు ఊరట
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు ఊరట లభించింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌ను పటియాల కోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి 2010-11 నాటి కాంగ్రెస్ బ్యాలెన్స్ షీట్, ఇతర పత్రాలను సమర్పించాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే సుబ్రహ్మణ్యస్వామి పిల్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది. కాగా దీనిపై సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులను సోనియా, రాహుల్ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టిన సంగతి విదితమే.