‘రూ.600కోట్లు జమ చేయ్.. లేదంటే ఇక జైలుకే..’
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌కు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి 6లోగా సెబీ-సహారాలో రూ.600 కోట్లు జమచేయాలని లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ రంజన్ గొగోయ్, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
చదవండి..(పెరోల్ పొడిగిస్తాం కానీ..రూ.600 కోట్లు చెల్లించు!)
ఇప్పటికే ఆయనకు చాలా అవకాశం ఇచ్చినట్లు కోర్టు స్పష్టం చేసింది. మరింత గడువు కావాలంటూ మరోసారి సహారా గ్రూపు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఇప్పటి వరకు సహారా గ్రూపు పెట్టుబడిదారులకు దాదాపు రూ.18,000 కోట్లు తిరిగి చెల్లించింది. అనంతరం మరో వెయ్యి కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించి అనంతరం ఆ మొత్తాన్ని రూ.600 కోట్లకు తగ్గించి ఫిబ్రవరి 6నాటికి చెల్లించాలని ఆదేశించింది.