ముంబై, సాక్షి: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌తోపాటు, అతనికి చెందిన మరో రెండు కంపెనీలను 8.4 బిలియన్ డాలర్లు(రూ. 62,600 కోట్లు) చెల్లించవలసిందిగా ఆదేశించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేసింది. చెల్లించలేని పక్షంలో అతనికిచ్చిన బెయిల్‌ను రద్దు చేయవలసిందిగా కోరింది. సహారా గ్రూప్.. 2012, 2015లలో కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించలేదని ఈ సందర్భంగా సెబీ తాజా ఫిర్యాదులో పేర్కొంది. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం సొమ్మును 15 శాతం వార్షిక వడ్డీతో చెల్లించవలసిందిగా గతంలో కోర్టు ఆదేశాలు జారీచేసినట్లు తెలియజేసింది. 2014లో అరెస్టయిన రాయ్ 2016 నుంచీ బెయిల్‌పై ఉన్నారు.
8 ఏళ్లుగా..
గత 8 ఏళ్లుగా నిబంధనలు ఉల్లంఘింస్తున్న రాయ్ ఇకనైనా పూర్తిసొమ్మును చెల్లించకుంటే కస్టడీలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టును తాజా ఫిర్యాదులో సెబీ కోరింది. గతంలో సహారా ఇండియా పరివార్ గ్రూప్ అసలు మొత్తంలో కొంతమేర మాత్రమే డిపాజిట్ చేసిందని, మిగిలిన సొమ్ముతోపాటు వడ్డీలు కలిపి భారీగా రూ. 62,600 కోట్లకు చేరాయని సుప్రీంకు సెబీ వివరించింది. 8 ఏళ్ల క్రితం ఈ మొత్తం రూ. 25,700 కోట్లు మాత్రమేనని తెలియజేసింది. కాగా.. సహారా ఇప్పటికే సెబీకి రూ. 22,000 కోట్లు డిపాజిట్ చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే పూర్తి సొమ్ముపై వడ్డీని విధించడం ద్వారా సెబీ భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. సహారా గ్రూప్ సెక్యూరిటీ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి 3.5 బిలియన్ డాలర్లను చట్టవిరుద్ధంగా సమీకరించినట్లు 2012లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయితే సహారా గ్రూప్ ఈ నిధులను తిరిగి చెల్లించకపోవడంతో గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌ను జైలుకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment