పెండింగ్‌కే ఫస్ట్ బెర్త్
తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు లేనట్టే...
ఐదు కొత్తరైళ్లకు ఓకే..!
సిద్దిపేట మీదుగా రైల్వే లైన్
{పతిపాదనను పరిశీలించిన గౌడ
యాగన్ వీల్ ఫ్యాక్టరీకి నిధులు
ఎంఎంటీఎస్ రెండో దశకు మోక్షం?
నేడే రైల్వే బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: కొత్త కేటాయింపులంటూ లేకుండా పాత ప్రాజెక్టుల ప్రస్తావనకే మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ పరిమితం కాబోతోంది. పదేళ్ల యూపీఏ పాలనాకాలంలో మంజూరై కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన పెండింగ్ జాబితాను కాదని కొత్త ప్రాజెక్టుల కేటాయింపు సరికాదనే ప్రధానమంత్రి మోడీ హితోపదేశానికి తగ్గట్టే రైల్వేమంత్రి సదానందగౌడ బడ్జెట్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కూడా కొత్త ప్రాజెక్టులకు చోటు దక్కలేదని తెలుస్తోంది. అయితే... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సూచించిన పెద్దపల్లి-సిద్దిపేట-సికింద్రాబాద్ (పెద్దపల్లి-మనోహరాబాద్) కొత్త లైన్, నిజామాబాద్-కరీంనగర్, మెదక్-అక్కన్నపేట (పెండింగ్)లకు మాత్రం మోక్షం లభించే అవకాశం కనిపిస్తోంది. ఇక, కాజీపేటకు డివిజన్ హోదా, వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీకి నిధుల కేటాయింపు, కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి కాకుండా తెలంగాణకు ఐదు కొత్త రైళ్లను కూడా బడ్జెట్ ప్రతిపాదించినట్టు సమాచారం
పాత సర్వేల పునఃపరిశీలన..?
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అవరాన్ని పునఃపరిశీలించాలని రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ నిర్ణయించినట్టు సమాచారం. ఇంతకాలం పనుల ఊసే లేనందున వాటి స్థానంలో డిమాండ్ ఉన్న ఇతర మార్గాలను ఎంపిక చేయాలనే అంశం కూడా మంత్రి పరిశీలనలో ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే తెలంగాణలోని కొన్ని ముఖ్యమైన పెండింగ్ ప్రాజెక్టులూ రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కోవలోకి వచ్చే తెలంగాణ ప్రాజెక్టులు...
ఆదిలాబాద్-ఆర్మూరు : 135 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే దాదాపు రూ.5 వేల కోట్లు కావాలి. కానీ, కొన్నేళ్ల క్రితం సర్వేచేసి దీన్ని పెండింగ్ జాబితాలో పెట్టారు. నయాపైసా విడుదల కాలేదు.పటాన్‌చెరు-ఆదిలాబాద్: 380 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు కోసం చాలాకాలం క్రితమే సర్వే చేశారు. కానీ దాదాపు రూ.7 వేల కోట్లకు పైగా నిధులు అవసరం అవుతుండటంతో దాన్ని పక్కన పెట్టేశారు.
కరీంనగర్-హసన్‌పర్తి: 2011లో సర్వే పనులు పూర్తి చేశారు. ఈ 145 కిలోమీటర్ల ప్రాజెక్టు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నా రైల్వేశాఖ మాత్రం నిధుల ఊసెత్తడం లేదు.
సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్: ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు రైల్వే ట్రాఫిక్ దృష్ట్యా రెండో లైన్ నిర్మాణం కోసం ఐదేళ్ల క్రితం సర్వే పూర్తి చేశారు. రూ.678 కోట్ల నిధులు అవసరం కావడంతో నిధుల కేటాయింపునూ పట్టించుకోలేదు.
సికింద్రాబాద్- కాజీపేట మూడో లైన్: ట్రాఫిక్ తీవ్రంగా ఉన్న ఇది కీలక ప్రాజెక్టు. కానీ, ఆరేళ్ల క్రితమే సర్వే పూర్తయినా ఒక్కపైసా విడుదల కాలేదు.
కాజీపేట వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీకి నిధులు...
ఐదేళ్ల క్రితం కాజీపేటకు వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీని కేటాయించిన రైల్వే ఈసారి దాని నిర్మాణానికి నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తయిందని, దాన్ని రైల్వేకు కేటాయించేందుకు సిద్ధమంటూ ఇటీవల రాష్ట్రప్రభుత్వం రైల్వేకు లేఖ రాసిన నేపథ్యంలో దాదాపు రూ. 200 కోట్లు కేటాయిస్తారని అంచనా వేస్తున్నారు.