ఢిల్లీ : కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించాలంటూ 'దేశవ్యాప్తంగా దిగ్విజయమైన 'దియా జలావొ'' అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి కరోనా బాధితులకు తాము అండగా ఉన్నామంటూ దిగ్విజయంగా దీపాలు, టార్చ్‌లైట్లు, మొబైల్‌ఫోన్ల లైట్లుతో తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ జ్యోతి ప్రజ్వలన చేసి కరోనాను తరిమేద్దాం అంటూ సంఘీభావం ప్రకటించారు.
మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి 9గంటలు కాగానే ప్రజలంతా తమ ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆర్పివేసి ఎవరికి నచ్చిన విధంగా వారు కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, మొబైల్ ఫోన్ లైట్లు, మరికొంత మంది ప్రమిదలతో తన ఐక్యత భావాన్ని చాటారు. దేశ ప్రధాని నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సెలబ్రిటీల నుంచి ఆటగాళ్ల దాకా అందరూ పాల్గొన్నారు.
ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలంతా తమ ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆర్పివేసి కరోనాపై చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కొవ్వొత్తిని వెలిగించి తన మద్దతు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఐఏఎస్,ఐపీఎస్ అధికారులతో కలిసి ప్రగతి భవన్‌లో దీపాలు వెలిగించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌లు కొవ్వొత్తితో కరోనాపై పోరాటానికి తన వంతుగా సంఘీభావం తెలిపారు. మార్చి 22న జనతా కర్ఫ్యూలో భాగంగా మోదీ ఇచ్చిన పిలుపు మేరకు చప్పట్లతో సంఘీభావం తెలిపిన దేశ ప్రజలు మరోసారి కరోనా బాధితులుకు తాము అండగా ఉన్నామంటూ దీపాలు వెలిగించి దేశ ఐకమత్యాన్ని చాటి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment