మళ్లీ పెట్రోల్ వాత
న్యూఢిల్లీ: తగ్గుతుందనుకున్న పెట్రోల్ ధర మళ్లీ పెరిగింది. లీటర్‌కు రూ.1.63 చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే కొత్తరేట్లు అమల్లోకి రానున్నాయి. దీనిపై వ్యాట్ లేదా స్థానిక అమ్మకపు పన్ను అదనం. తాజా పెరుగుదలతో గత జూన్ నుంచి ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.10.80 మేరకు (వ్యాట్ అదనం) పెరిగినట్టయింది. పెట్రోల్ ధర గత మూడున్నర నెలల్లో పెరగడం ఇది ఏడోసారి. వాస్తవానికి ఈ నెల 15/16 తేదీల్లో పెట్రోల్ ధర కొంత తగ్గవచ్చనే వార్తలు వెలువడ్డాయి. గత కొద్దిరోజులుగా రూపాయి విలువ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆశాభావం వ్యక్తమైంది. కానీ ఊహించనిరీతిలో నిర్ణీత తేదీకంటే ముందే చమురు కంపెనీలు పెంపును ప్రకటించాయి.
ఈ నెల మొదట్లో రూపాయి విలువ క్షీణతను ఇందుకు సాకుగా చూపాయి. పెట్రోల్ అంతర్జాతీయ సగటు ధరలు పెరిగాయని దేశంలోనే అతిపెద్ద చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేర్కొంది. అదే సమయంలో సగటు మారకపు రేటు తగ్గిందని తెలిపింది. ఈ రెండు కారణాల దృష్ట్యా పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.1.63 చొప్పున పెంచాల్సి వచ్చిందని ఐఓసీ వివరించింది. గత జూన్ 1న వ్యాట్ కాకుండా 75 పైసల మేరకు పెరిగిన పెట్రోల్ ధర అదే నెల 16న రూ.2, 29న రూ.1.82, జూలై 15న రూ.1.55, ఆగస్టు 1న 70 పైసలు, సెప్టెంబర్ 1న రూ.2.35 మేరకు పెరిగింది. ఇలావుండగా త్వరలోనే డీజిల్ ధర ఒకేసారి లీటర్‌కు రూ.3-5 మేరకు, ఎల్పీజీ ధర సిలిండర్‌కు రూ.50 చొప్పున పెరిగే అవకాశాలున్నాయి.