rupee weak
-
బలహీన రూపాయితో భారత్ కంపెనీలు బేఫికర్
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధిక ఇంధన ధరలు వంటి అంతర్జాతీయ సవాళ్లు కరెన్సీ అస్థిరతను పెంచుతాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మంగళవారం తెలిపింది. అయితే దేశంలోని పలు రేటింగ్ కంపెనీలు బలహీనమైన రూపాయిని తట్టుకోగలిగిన పరిస్థితిని కలిగిఉన్నాయని విశ్లేషించింది. ఏడాది ప్రారంభం నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 10 శాతం క్షీణించింది. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపాయి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.01నీ చూసింది. అప్పట్లో గడచిన కేవలం 14 రోజుల్లో 100 పైసలు నష్టపోయి, 83 స్థాయిని చూసింది. కాగా, మరుసటి రోజు అక్టోబర్ 20న బలహీనంగా 83.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే చివరకు చరిత్రాత్మక పతనం నుంచి 21 పైసలు కోలుకుని 82.79 వద్ద ముగిసింది. అటు తర్వాత కొంత బలపడినా, రూపాయి ఇంకా బలహీన ధోరణిలోనే ఉందన్నది విశ్లేషణ. ఈ నేపథ్యంలో మూడీస్ తాజా నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► అధిక ఇంధన ధరలు, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్ల స్థిరమైన పెరుగుదల వంటి అంశాలు భారత్ కరెంట్ అకౌంట్ (దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రభావం చూపుతాయి. ఇది రూపాయిపైనా ఒత్తిడిని పెంచుతుంది. ► అయితే ఈ తరహా అంతర్జాతీయ సవాళ్లను దేశ కరెన్సీ ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశంలోని చాలా రేటెడ్ కంపెనీలు రూపాయి క్షీణతను తట్టుకునే బఫర్లను కలిగి ఉన్నాయి. ► రూపాయి క్షీణించడం దేశీయ కరెన్సీలో ఆదాయాన్ని ఆర్జించే భారతీయ కంపెనీలకు క్రెడిట్ ప్రతికూలమే. అయితే ఆయా కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన నిధుల విషయంలో డాలర్ రుణ నిష్పత్తి ఎంతుందన్న విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. ► పలు అంశాల విశ్లేషణల అనంతరం, రేటింగ్ పొందిన కంపెనీలకు ప్రతికూల క్రెడిట్ చిక్కులు పరిమితంగా లేదా తాత్కాలికంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. ► చాలా రేటెడ్ కంపెనీలు కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని పరిమితం చేయడానికి తగిన రక్షణలను (హెడ్జింగ్ సౌలభ్యాలు) కలిగి ఉన్నాయి. రూపాయి తీవ్ర పతన సమయాల్లోనూ ఈ ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడంలో ఇవి దోహదపడతాయి. ► భారతదేశం రుణంలో ఎక్కువ భాగం స్థానిక కరెన్సీలో ఉంది. విదేశీ కరెన్సీ రుణం బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వాముల నుండి దాదాపు రాయితీల ప్రాతిపదికన ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనత వల్ల ఎకానమీకి ఇబ్బంది ఏదీ ఉండబోదు. ► రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ కరెన్సీ రుణాలను తీర్చగల ప్రభుత్వ సామర్థ్యంలో ప్రతికూలతలు ఏర్పడతాయని మేము భావించడం లేదు. ► భారత్ ఎకానమీలో ద్రవ్య స్థిరత్వానికి ఢోకా లేదు. ఆదాయాలు పటిష్టంగా ఉన్నాయి. రుణ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయా అంశాలు దేశంపై రేటింగ్‌కు సంబంధించి ఒత్తిడులను తగ్గిస్తాయి. ► మంచి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవ త్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందని భావిస్తున్నాం. భారత్‌కు మూడీస్ రేటింగ్ ఇలా... మూడీస్ గత ఏడాది అక్టోబర్‌లో భారత్ సావరిన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్థిరత్వానికి’ అప్‌గ్రేడ్ చేసింది. ‘బీఏఏ3’ రేటింగ్‌ను పునరుద్ఘాటించింది. అయితే ఇది చెత్త గ్రేడ్‌కు ఒక అంచె అధికం కావడం గమనార్హం. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇటీవలే తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి కుదించింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణం. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంది. 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందన్నది మూడీస్ అంచనా. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. -
గోల్డ్ బాజా!
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రపంచ దేశాలను భయాందోళనలోకి నెట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి, దీనితో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థలు, అనిశ్చితి పరిస్థితులు, ఈక్విటీల బలహీన ధోరణి అంతర్జాతీయంగా బంగారానికి బలాన్ని అందిస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు ప్రస్తుతం ప్రధాన మార్గంగా పసిడివైపు చూస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం 26 డాలర్లకుపైగా పెరిగి 1,778.95 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే సమయం రాత్రి 9.30 గంటల సమయంలో 1,774 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో చూస్తే, అంతర్జాతీయ ధోరణికితోడు డాలర్ మారకంలో రూపాయి బలహీనత పసిడికి వరమవుతోంది. దేశీయంగా 50 వేల దిశగా... హైదరాబాద్, విజయవాడసహా దేశ వ్యాప్తంగా పలు స్పాట్ బులియన్ మార్కెట్లలో సోమవారం 10 గ్రాముల స్వచ్ఛత ధర ఒక దశలో రూ.50,000 దాటినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే అటు తర్వాత రూపాయి బలోపేతం పసిడి ధరను కొంత తగ్గించింది. ఈ వార్త రాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎంసీఎక్స్)లో ధర స్వల్ప లాభంతో 48,026 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ గత శుక్రవారంతో పోల్చితే సోమవారం 17 పైసలు బలపడి 76.03 వద్ద ముగిసింది. కరోనా భయాలు, ఈక్విటీల అనిశ్చితికి తోడు చైనాతో ఉద్రిక్తతలూ ఇప్పుడు రూపాయి విలువను భయపెడుతున్నాయి. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). మళ్లీ ఆ కనిష్టాల దిశగా రూపాయి కదిలితే దేశీయంగా పసిడి ధర వేగంగా రూ 50,000 దాటేస్తుందనేది నిపుణుల అంచనా. 1,800 డాలర్లు దాటితే పరుగే... అంతర్జాతీయంగా పసిడి ధరకు 1,800 డాలర్ల వద్ద పటిష్ట నిరోధం ఉంది. ఈ స్థాయిని దాటితే పసిడి వేగంగా తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు దూసుకుపోయే వీలుందని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. మాంద్యంలోకి జారుకుంటున్నపలు ప్రధా న దేశాల ఆర్థిక వ్యవస్థలను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి అప్ట్రెండ్వైపు మొగ్గు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కరోనా కట్టడి జరక్కుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా కొనసాగి, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేటు నెగటివ్‌లోకి వెళితే... పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,362 డాలర్లయితే, గరిష్ట స్థాయి 1,789 డాలర్లు. ప్రపంచ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఏడాది లోపు 2000 డాలర్లను అందుకుంటుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మెన్ శాక్స్ ఇప్పటికే ఒక నివేదికలో పేర్కొంది. మా వద్ద 13,212 కేజీల పసిడి డిపాజిట్లు: ఎస్బీఐ పడిసి డిపాజిట్ స్కీమ్ (గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్– జీఎంఎస్) ద్వారా బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మొత్తం 13,212 కేజీల పసిడిని సమీకరించింది. బ్యాంక్ వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. జీఎంఎస్ కింద ఒక్క 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3,973 కేజీల పసిడిని సమీకరించినట్లు వెల్లడించింది. వ్యక్తులు, ట్రస్టుల వద్ద నిరుపయోగంగా ఉన్న పసిడి వినియోగానికి ప్రభుత్వం 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) స్కీమ్ ద్వారా దాదాపు రూ.244 కోట్ల విలువైన 647 కేజీల పసిడిని సమీకరించినట్లు బ్యాంక్ పేర్కొంది. తద్వారా ఈ ఒక్క స్కీమ్‌తో పసిడి సమీకరణ పరిమాణం 5,098 కేజీలకు (రూ.1,561 కోట్లు) చేరినట్లు బ్యాంక్ తెలిపింది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ఫిజికల్ గోల్డ్ డిమాండ్ తగ్గించడం లక్ష్యంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎస్జీబీని తీసుకువచ్చింది. -
మళ్లీ పెట్రోల్ వాత
న్యూఢిల్లీ: తగ్గుతుందనుకున్న పెట్రోల్ ధర మళ్లీ పెరిగింది. లీటర్‌కు రూ.1.63 చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే కొత్తరేట్లు అమల్లోకి రానున్నాయి. దీనిపై వ్యాట్ లేదా స్థానిక అమ్మకపు పన్ను అదనం. తాజా పెరుగుదలతో గత జూన్ నుంచి ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.10.80 మేరకు (వ్యాట్ అదనం) పెరిగినట్టయింది. పెట్రోల్ ధర గత మూడున్నర నెలల్లో పెరగడం ఇది ఏడోసారి. వాస్తవానికి ఈ నెల 15/16 తేదీల్లో పెట్రోల్ ధర కొంత తగ్గవచ్చనే వార్తలు వెలువడ్డాయి. గత కొద్దిరోజులుగా రూపాయి విలువ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆశాభావం వ్యక్తమైంది. కానీ ఊహించనిరీతిలో నిర్ణీత తేదీకంటే ముందే చమురు కంపెనీలు పెంపును ప్రకటించాయి. ఈ నెల మొదట్లో రూపాయి విలువ క్షీణతను ఇందుకు సాకుగా చూపాయి. పెట్రోల్ అంతర్జాతీయ సగటు ధరలు పెరిగాయని దేశంలోనే అతిపెద్ద చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేర్కొంది. అదే సమయంలో సగటు మారకపు రేటు తగ్గిందని తెలిపింది. ఈ రెండు కారణాల దృష్ట్యా పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.1.63 చొప్పున పెంచాల్సి వచ్చిందని ఐఓసీ వివరించింది. గత జూన్ 1న వ్యాట్ కాకుండా 75 పైసల మేరకు పెరిగిన పెట్రోల్ ధర అదే నెల 16న రూ.2, 29న రూ.1.82, జూలై 15న రూ.1.55, ఆగస్టు 1న 70 పైసలు, సెప్టెంబర్ 1న రూ.2.35 మేరకు పెరిగింది. ఇలావుండగా త్వరలోనే డీజిల్ ధర ఒకేసారి లీటర్‌కు రూ.3-5 మేరకు, ఎల్పీజీ ధర సిలిండర్‌కు రూ.50 చొప్పున పెరిగే అవకాశాలున్నాయి. -
రూపాయి మరింత డౌన్
ముంబై: రెండు రోజుల లాభాల అనంతరం రూపాయి బుధవారం మరో కొత్త కనిష్ట స్థాయిలో ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 53 పైసలు క్షీణించి 61.30 వద్ద క్లోజయ్యింది. గత శుక్రవారం నాటి 61.10 తర్వాత ఇది కొత్త కనిష్ట స్థాయి ముగింపు. డాలర్లకు దిగుమతిదారుల నుంచి డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణం. అమెరికా ఫెడరల్ రిజర్వ్.. బాండ్ల కొనుగోలు ప్రక్రియను ఉపసంహరించే అవకాశాలున్నాయన్న సంకేతాలు, మరిన్ని విదేశీ నిధులు తరలిపోతుండటం సైతం రూపాయి బలహీనతకు దారితీశాయని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. రూపాయి ట్రేడింగ్ 60.90-61.90 శ్రేణిలో ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.