జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్: లీ రూ. 43.44
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. వినియోగదారుల పాలిట గుదిబండలా తయారయ్యాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగానే ఉన్న భారత్‌లో మాత్రం డీజిల్, పెట్రోల్ ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. వీటిని నియంత్రించే విధంగా ఇటీవల చమురు శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు.
మంత్రి చెప్పినట్లుగా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న జీఎస్టీ స్లాబ్‌లలో అత్యథికంగా ఉన్న 28శాతంలో చేరిస్తే లీటర్ పెట్రోల్ గరిష్టంగా రూ43.44లకే లభిస్తుంది. 18శాతం స్లాబ్‌లో రూ.40.05లకు, 12శాతం స్లాబ్‌లో కనిష్టంగా కేవలం రూ.38.10లకే అందుబాటులోకి వస్తుంది.
అలాగే డీజిల్ ధరల్లో కూడా భారీ మార్పులు జరుగుతాయి. 12శాతం స్లాబ్‌లో 36.65, 18శాతం స్లాబ్‌లో రూ.38.61లకే వస్తుంది. 2014 నుంచి కేంద్రం, అంతర్జాతీయం ముడిచమురు ధరలు పతనమైనా ఎక్సైజ్ పన్నును పెంచింది. అన్ని పన్నులతో కలుపుకొని డీజిల్ ఇప్పటి రూ13.47 పెరగగా, పెట్రోల్ రూ.11.77 పెరిగింది. అప్పటి నుంచి ప్రభుత్వానికి ఎక్సైజ్ పన్ను నుంచి వచ్చే ఆదాయం రెట్టింపు అయింది. 2014-15లో ఎక్సైజ్ పన్నుతో రూ.99వేల కోట్లు ఆదాయం రాగా, 2016-17లో సుమారు రెండితలు పెరిగి రూ.2 లక్షల 42 వేల కోట్లకు చేరింది.