సోషల్ మీడియాను తప్పుదోవ పట్టించిన ఫొటో
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం నగరంలో గత నాలుగు రోజులుగా కార్ల రాకపోకలను నియంత్రించేందుకు అనుసరిస్తున్న ‘సరి-బేసి’ విధానాన్ని ముందుగా ప్రశంసించిన సోషల్ మీడియా సోమవారం హఠాత్తుగా తన వైఖరిని మార్చుకొని ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శించింది. అందుకు కారణం అందర్ని తప్పుదోవ పట్టించే ఫొటోను పోస్ట్ చేయడమే. ఆ ఫొటోను పోస్ట్ చేసింది కూడా సోషల్ మీడియానే.
నగరంలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద ఇసుక పడితే రాలనంత జనంతో కిక్కిర్సి వెళుతున్న మెట్రో రైలు ఫొటోను ఆన్‌లైన్‌లో ఎవరో పోస్ట్ చేశారు. దీన్ని గమనించిన సోషల్ మీడియా యూజర్లు, ముఖ్యంగా ట్విట్టర్‌లో సరైన ముందస్తు ప్రయాణ ఏర్పాట్లు లేకుండా ఈ ‘సరి-బేసి’ విధానం ఏమిటంటూ విమర్శలు కురిపించారు. వాస్తవానికి ఆ ఫొటో 2014, అక్టోబర్ 22వ తేదీన దీపావళి రోజున తీసింది. ఆ రోజున ఈ ఫొటోను ప్రచురించిన ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రికనే ఫొటోకు ఇప్పుడు నగరంలో కొనసాగుతున్న ‘సరి-బేసి’ విధానానికి ఎలాంటి సంబంధం లేదని ట్వీట్ చేయడంతో యూజర్లకు అసలు విషయం తెల్సింది. దీంతో పరిస్థితి అంతా ఒక్కసారిగా కామిక్‌గా మారిపోయింది.
రాజీవ్ చౌక్ వద్ద నాటి తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న ఫొటో నుంచి ఓ రాక్‌స్టార్ గ్రూప్ కచేరికి భారీ సంఖ్యలో హాజరైన ప్రజల ఫొటో.....రైలుపై బాలివుడ్ హీరో షారుక్ ఖాన్ ‘చెయ్య...చెయ్య...చెయ్యా’ అంటూ పాడుతున్న ఫొటో....ఇలా సోషల్ మీడియా యూజర్లు ఎవరికి ఇష్టం మొచ్చిన ఫొటోను వారు పోస్ట్ చేస్తూ వచ్చారు.
‘సరి-బేసి’ విధానం వల్ల వాస్తవానికి సోమవారం నాడు ప్రయాణికులు భారీ సంఖ్యలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ఆశ్రయించారు. రద్దీని తట్టుకునేందుకు అదనపు బస్సులు నడిపారు. మెట్రో రైళ్లు కూడా అదనపు ట్రిప్పులు తిరగాల్సి వచ్చింది.