
అంతా కళ్లప్పగించి చూశారే తప్ప..
కావేరి అల్లర్లపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఢిల్లీ: కావేరి అల్లర్లపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆస్తుల విధ్వంసం జరుగుతుంటే అందరూ కళ్లప్పగించి చూశారు తప్ప ఏ ఒక్కరు వాటిని నివారించేందుకు ప్రయత్నించలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ పిటిషనర్ అందులో పేర్కొన్నాడు. కావేరి జలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య తీవ్ర విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 25 వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో శివకుమార్ అనే ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య ఘర్షణకు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అల్లర్ల సందర్భంగా జరిగే నష్టానికి ఎవరు పరిహారం చెల్లిస్తారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.