సాక్షి, న్యూఢిల్లీ : తదుపరి సీబీఐ డైరెక్టర్‌ను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎంపిక కమిటీ ఈనెల 24న సమావేశం కానుంది. ప్రధాని నేతృత్వంలోని ఈ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సభ్యులుగా ఉన్నారు. తొలుత ఈనెల 21న కమిటీ సమావేశం కావాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, ఈనెల 24 లేదా 25న సమావేశం జరగాలని ఖర్గే కోరారు. తర్జనభర్జనల అనంతరం నూతన సీబీఐ చీఫ్‌ను ఎంపిక చేసేందుకు ఈనెల 24న సమావేశం కావాలని ప్రభుత్వం కమిటీ భేటీకి తేదీని ఖరారు చేసింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చీఫ్‌గా తిరిగి నియమితులైన ఆలోక్ వర్మను ఆ పదవి నుంచి తొలగించి ఫైర్ సర్వీసుల డీజీగా నియమించినప్పటి నుంచి సీబీఐ డైరెక్టర్ పదవి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఆలోక్ వర్మ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. కాగా సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ప్రభుత్వ ఐపీఎస్ అధికారి ఎం నాగేశ్వరరావును నియమించింది. సీబీఐకి పూర్తిస్ధాయి డైరెక్టర్‌ను నియమించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానిపై ఒత్తిడి పెంచుతోంది.
Comments
Please login to add a commentAdd a comment