
అంతిమ లక్ష్యం పాకిస్తాన్‌పై యుద్ధమేనా?
న్యూఢిల్లీ: భారత సైనిక దళాల ప్రధానాధికారి (ఆర్మీచీఫ్)గా లెఫ్ట్‌నెంట్ జనరల్ బిపిన్ రావత్‌ను నియమించడం వెనక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంతర్యం ఏమిటీ? ఆయనకన్నా ఇద్దరు సీనియర్ అధికారులను కాదని ఆయన్నే ఎందుకు ఎంపిక చేశారు? ఆర్మీ చీఫ్ నియామకాల్లో అనాదిగా వస్తున్న భారత సంప్రదాయాన్ని మోదీ ప్రభుత్వం ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది? ఇప్పుడు ఇటు సైనిక వర్గాలను, అటు రాజకీయ వర్గాలను ప్రధానంగా తొలుస్తున్న ప్రశ్నలివి.
డిసెంబర్ 31వ తేదీన ప్రస్తుత ఆర్మీచీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రవీణ్ భక్షీ లాంటి సీనియర్ అధికారులను కాదని బిపిన్ రావత్‌ను నియమించాలని మోదీ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం నిర్ణయించడం తెల్సిందే. దీనిపై సైనిక వర్గాలు, కాంగ్రెస్, వామపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. సీనియరీటీనే ప్రాతిపదికగా తీసుకొని ఆర్మీచీఫ్‌లను నియమిస్తున్న 33 ఏళ్లలో సంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడం ఇది రెండోసారి మాత్రమే.
మొదటిసారి ఎప్పుడు?
1983లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సైన్యంలో సీనియర్ అధికారి అయిన లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎస్‌కే సిన్హాను కాదని, ఏఎస్. వైద్యను నియమించింది. అప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి దేశంలో రెండోసారి సంప్రదాయాన్ని ఉల్లంఘించింది. కొత్త ఆర్మీ చీఫ్‌గా రావత్‌ను ఎంపిక చేయడంలో ప్రధాని మోదీతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముఖ్యపాత్ర పోషించారు.
అందరి దృష్టిని ఆకర్షించిన రావత్...
ఒకనాడు ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణాయాన్ని తన పార్టీయే తప్పు పట్టిన విషయం తెల్సికూడా మోదీ సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించారు. దీనికి జవాబు తెలసుకోవాలంటే కొంత వెనక్కి వెళ్లాలి. పాకిస్తాన్ భూభాగంలోకి సెప్టెంబర్ 29వ తేదీన భారత ప్రత్యేక సైనిక దళాలు దూసుకెళ్లి టెర్రరిస్టు శిబిరాలపై సర్జికల్ దాడులు జరపడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న రోజులవి. నవంబర్ నెలలో నేషనల్ డిఫెన్స్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి బిపిన్ రావత్ హాజరయ్యారు. ఆ రోజు సైనిక సీనియర్ అధికారుల కోసం ఏర్పాటు చేసిన విందులో అందరి దృష్టి రావత్‌పై పడింది. సర్జికల్ దాడులను తీవ్రంగా సమర్థించిన ఆయన జరిగిన తీరుపట్ల కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న టెర్రరిస్టుల నిర్మూలనకు ఇంతకన్నా తీవ్రమైన దాడులు చేయాలని, పాకిస్తాన్‌లోని అబాటాబాద్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా సైనికులు హతమార్చిన స్థాయిలో పాక్ భూభాగంపై భారత్ సైనిక దళాలు దాడులు జరపాలంటూ ఆయన గట్టిగా వాదించారు. టెర్రరిస్టులను సమూలంగా నిర్మూలించే వరకు ఇలాంటి దాడులను కొనసాగించాల్సిందేనని కూడా చెప్పారు.
అజిత్ దోవల్‌తో దోస్తీ ఎలా?
గతేడాది జూన్ నెలలో మైన్మార్ భూభాగంలోకి చొచ్చుకుపోయి నాగా తిరుగుబాటుదారులను హతమార్చిన ప్రత్యేక దళాలకు కమాండర్‌గా వ్యవహరించడం ద్వారా రావత్ ప్రముఖంగా వార్తల్లోకి వచ్చారు. మణిపూర్‌లోని దోగ్ర సైనిక పటాలంపై నాగా తీవ్రవాదులు దాడి జరిపి 18 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకోవడంతో ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక దళాల ప్రతీకార దాడి జరిగింది. ఆ సంఘటన ద్వారా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు రావత్ వ్యక్తిగతంగా దగ్గరయ్యారు. సర్జికల్ దాడులపై చేసిన వ్యాఖ్యల ద్వారా మరింత ఆకర్షించారు.
అనుభవం కూడా ముఖ్యమనే....
గడచిన మూడు దశాబ్దాలలో చైనా, పాక్ సరిహద్దుల్లో సైనిక ఆపరేషన్లు నిర్వహించడంలో అపార అనుభవం కలిగిన రావత్‌కు తిరుగుబాటు దారులను, టెర్రరిస్టులను సమర్థంగా ఎదుర్కోవడంలోనూ అనుభవం ఉంది. సైనిక ఆపరేషన్లలో దూకుడు స్వభావం ప్రదర్శించే రావత్ ప్రజా, రాజకీయ సంబంధాల్లో సమన్వయం, సమతౌల్యం పాటిస్తారన్న పేరుంది. కాంగోలోని ఐక్యరాజ్యసమితి సైనిక దళాల్లో కమాండెంట్‌గా పనిచేసిన రావత్ తన దూకుడు స్వభావాన్ని 2008లో లండన్ నుంచి వెలువడుతున్న టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన నియమనిబంధనలు లోబడి సైనిక ఆపరేషన్లు నిర్వహించాల్సి రావడం పట్ల అసంతప్తి వ్యక్తం చేశారు. కొన్ని లక్ష్యాలను సాధించాలంటే కొన్ని సంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టాల్సి ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు.
అసలు కారణం ఏమిటంటే....
పాకిస్తాన్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రావత్ దూకుడు స్వభావం నచ్చిందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రతికూల ఫలితాలు వచ్చినట్లయితే టెర్రరిస్టుల ఏరివేత లక్ష్యంతో పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి మరిన్ని సర్జికల్ దాడులు జరపాలన్నది మోదీ ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని ఆ వర్గాలు అంటున్నాయి. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడానికి పాక్‌ను బూచిగా చూపించి, అవసరమైతే యుద్ధం కూడా చేయాలన్నది మోదీ అభిమతమని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.
--- (సాక్షి వెబ్‌సైట్ ప్రత్యేకం)