ఓబీసీల హక్కులను కాలరాయొద్దు
విపక్షాలపై మోదీ విమర్శలు
న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన కులాల ప్రజల హక్కులను వారికి అందకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లు–2017 (రాజ్యాంగ సవరణ–123వ)కు సంబంధించి రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని ఈ విమర్శలు చేశారు. అన్ని పార్టీల కోరిక మేరకే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందన్నారు.
‘లోక్‌సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. కానీ రాజ్యసభలో విపక్షపార్టీలు ఈ బిల్లుకు ఎందుకు అడ్డుపడుతున్నాయో అర్థం కావటం లేదు. వెనుకబడిన తరగతుల హక్కులను అడ్డుకునే వ్యతిరేక రాజకీయాలు చూసి చింతిస్తున్నాం’ అని మోదీ అన్నారు. బీజేపీ ఓబీసీ ఎంపీలు.. ఇతర పార్టీల్లోని ఓబీసీ రాజ్యసభ ఎంపీలను కలిసి వారిని ఒప్పించాలని సూచించారు.