
‘బిచ్చగాడు’ సినిమాను మోదీ చూశారా?
న్యూఢిల్లీ: దేశంలో 500, 1000 రూపాయల నోట్లను మంగళవారం అర్ధరాత్రి నుంచి రద్దుచేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం డబ్బింగ్ ‘బిచ్చగాడు’ చూసి స్ఫూర్తి పొందిందా? ఆ చిత్రంలోని బిచ్చగాడు పాత్ర రేడియో స్టేషన్ జాకీతో మాట్లాడుతూ దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే 500, 1000 రూపాయల నోట్లను నిషేధించాలని సూచించడం, దేశాన్ని నల్లడబ్బు ఎలా దోచుకుంటుందో వివరించడం మరోసారి చూస్తే మనకు ఈ అనుమానం రాక తప్పదు. విజయ్ ఆంటోనీ హీరోగా ఇటీవల తెలుగులో విడుదలై హిట్ ట్రాక్తో పాటు భారీ వసూళ్లును సొంతం చేసుకున్న తమిళ డబ్బింగ్ చిత్రం ‘బిచ్చగాడు’లోని డైలాగ్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
బిచ్చగాడు ఒక్క చిత్రంలోనే కాదు నల్లడబ్బు గురించి వెయ్యిరూపాయల నోటు మంచి, చెడుల గురించి పలు బాలీవుడ్‌తోపాటు పలు దక్షిణాది చిత్రాల్లో కూడా ప్రస్థావన ఉంది. ‘ఎక్ హజారచి నోట్’ అని మరాఠీ చిత్రంలోనైతే సినిమా అంతా ఆ నోటు చుట్టే తిరుగుతుంది. ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఓ వెయ్యి రూపాయల నోటును తీసుకున్నందుకు ఓ గ్రామీణ పేద మహిళ ఆ చిత్రంలో తీవ్రంగా కుమిలి పోతుంది. ‘నోట్ హజారోంకా, ఆయి చిక్నీ చమేలి, చుట్టా కరానా హాయి’ అంటూ కత్రినా కైఫ్ ఓ బాలివుడ్ చిత్రం పాటకు ఆటను జోడించడం ప్రస్తుతం పరిస్థితిని సూచిస్తోంది.
కాలా బజార్ చిత్రంలోని పైసా బోల్తాహై...పాట, దే దనాదన్ చిత్రంలోని పైసా,పైసా అన్న పాట, బ్లాక్‌మనీ మ్యూజిక్ వీడియో.....వీటిలో ఏవైనా మోదీ ప్రభుత్వానికి స్ఫూర్తినివ్వవచ్చు. బిచ్చగాడు చిత్రంలోని బ్లాక్‌మనీ సన్నివేశానికి సంబంధించిన క్లిప్పింగ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా చెక్కర్లు కొడుతోంది. చిల్లర సమస్యలు మాత్రం 1980 నాటి ‘ఉదార్ కీ జిందగీ’ కష్టాలను గుర్తుచేస్తున్నాయి.
ఏదేమైనా ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను హఠాత్తుగా రద్దు చేయడం ఆశించిన ఫలితాలను ఇవ్వదని, అంతేకాకుండా ఊహించని సమస్యలను కూడా తెచ్చిపెడుతుందని కొంత మంది ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోకి నకిలీ నోట్లను చేరవేస్తున్న టెర్రరిస్టు మూకలను పాత నోట్ల రద్దు ద్వారా అరికట్టవచ్చని ప్రధాని మోదీ చెబుతున్నారు. నకిలీ నోట్లను చేరవేయగలిగిన టెర్రరిస్టులు వాటిని సకాలంలోనే విదేశీ కరెన్సీలోకి తీసుకొని దేశంలోకి తీసుకరాలేరా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.