వాళ్లను విపక్షాలే పంపిస్తున్నాయి: రాందేవ్
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో విమర్శలు చేస్తున్న విపక్షాలపై యోగా గురువు రాందేవ్ బాబా ఎదురుదాడికి దిగారు. బ్యాంకులతో పాటు ఏటీఎంల వద్దకు ప్రతిపక్ష పార్టీలు... తమ వ్యక్తులను పంపించి, రద్దీని సృష్టిస్తోందంటూ విమర్శలు చేశారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్ద నోట్ల చలామణీని రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్నిరాందేవ్ బాబా మరోసారి ప్రశంసించారు.
మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ కరోనరీ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని దేశమంతా కీర్తిస్తోంది, దీని వల్ల అక్రమ వ్యాపారాలు, అవినీతి, ఆర్థికనేరాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. అవినీతి, నల్లధనం, తీవ్రవాదం అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు కూడా సహకరించాలని రాందేవ్ బాబా కోరారు.
యుద్ధ సమయంలో శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించేందుకు భారత సైనికులు సరిహద్దుల్లో పోరాడేటప్పుడు అనేక ఇబ్బందులు పడుతూ వారం, పదిరోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఉంటారని, అలాంటిది దేశం కోసం మనం ఆ మాత్రం కూడా చేయలేమా అంటూ ప్రశ్నించారు. అయితే కొంతమంది వ్యక్తులు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తున్నారని, కేంద్రం చర్యతో వాళ్లే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు చేశారు. అలాగే యోగాతో పాటు ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించాలని ఆయన సూచించారు.