
లక్షద్వీప్‌లో తుపాను బాధితుల సమస్యలు వింటున్న మోదీ
తిరువనంతపురం/ చెన్నై: ఓక్కి తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. సాధ్యమైనంత మేర కేంద్రప్రభుత్వం సాయం అందిస్తుందని బాధిత రాష్ట్రాలకు ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం ముందుగా మోదీ లక్షద్వీప్ రాజధాని కవరట్టి చేరుకున్నారు. సహాయ, పునరావాస చర్యల కోసం రూ.150 కోట్ల సాయం అందించాలని అక్కడి ఉన్నతాధికారులు మోదీని కోరారు. అనంతరం మోదీ తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడ సీఎం పళనిస్వామితో సమావేశమయ్యారు.
రాష్ట్రానికి రూ.9,302 కోట్ల సాయం అందించాలని సీఎం పళనిస్వామి నష్టం నివేదిక అందజేశారు. అనంతరం మోదీ కేరళ రాజధాని తిరువనంతపురానికి 20కి.మీ. దూరం లో ఉన్న పూన్‌తురా అనే మత్స్యకార గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. కనిపించకుండా పోయిన మత్స్యకారులను క్రిస్ట్‌మస్ పండుగలోగా స్వస్థలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు రూ.7,340 కోట్లు అందించాలని సీఎం పినరయి విజయ్ కోరారు.