న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేది నకిలీ ఎన్‌కౌంటర్ కాదని ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. అదే విధంగా ఈ ఎన్‌కౌంటర్‌ను తెలంగాణ కేసు(దిశ నిందితుల ఎన్‌కౌంటర్)తో పోల్చవద్దని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, చట్ట ప్రకారమే తాము నడుచుకున్నామని.. యూపీ సర్కారు ఇప్పటికే ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీని నియమించిందని తెలిపారు. తమకు తగినంత సమయం ఇస్తే అన్ని ఆధారాలు న్యాయస్థానానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. కాగా జూలై 2న ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అనేక నాటకీయ పరిణామాల మధ్య మధ్యప్రదేశ్‌లో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. (ఒక్క ఫిర్యాదు.. పోలీసుల మరణం.. దుబే హతం!?)
ఈ క్రమంలో జూలై 10న అతడిని కాన్పూర్‌కు తరలిస్తుండగా.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లోని కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. దీంతో పోలీసుల తుపాకీ లాక్కొని తప్పించుకునేందుకు ప్రయత్నించిన దుబే తమపై కాల్పులకు తెగబడటంతో అతడిని ఎన్‌కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే దుబే ఎన్‌కౌంటర్‌పై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో పోలీసుల మరణం, దుబే ఎన్‌కౌంటర్ కేసులను సీబీఐ లేదా ఎన్‌ఐఏతో విచారణ జరిపించాల్సిందిగా సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ దిశ అత్యాచారం, హత్య నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో మాదిరి రిటైర్డు జడ్జి నేతృత్వంలో విచారణ కమిటీ నియమించే యోచనలో ఉన్నట్లు ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.(దుబే హతం: తెలంగాణ మాదిరిగానే..)
అందుకే సంకెళ్లు వేయలేదు
ఈ నేపథ్యంలో శుక్రవారం యూపీ డీజీపీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. ‘‘ వికాస్ దుబేది నకిలీ ఎన్‌కౌంటర్ కాదు. తెలంగాణ కేసుతో దీనిని పోల్చవద్దు. ఎందుకంటే అక్కడ తెలంగాణ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు ఆదేశించలేదు. కానీ యూపీ సర్కారు అలా చేయలేదు. చట్టం ప్రకారం, సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను అనుసరించే పోలీసులు నడుచుకున్నారు. మాకు మరికొంత సమయం ఇస్తే వాస్తవాలను మీ ముందుకు తీసుకువస్తాం.
వికాస్ దుబే కరుడుగట్టిన నిందితుడు. అతడిపై 64 కేసులు ఉన్నాయి. తెలంగాణలో మాదిరి వికాస్ దుబేను క్రైంసీన్ దగ్గరకు తీసుకువెళ్లలేదు. అతడు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి మెటీరియల్ ఎవిడెన్స్ సమర్పిస్తాం. భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే అతడిని ఒక వాహనం నుంచి మరో వాహనంలోకి మార్చాం. మీడియా వాహనాలను కూడా మేం ఎక్కడా ఆపలేదు. 15 మంది పోలీసులం ఉన్నాం కాబట్టే దుబే చేతికి సంకెళ్లు వేయలేదు’’ అని పేర్కొన్నారు. కాగా దుబేను తీసుకువెళ్తున్న కాన్వాయ్‌ను అనుసరిస్తున్న తమను ఎన్‌కౌంటర్ జరిగిన స్థలానికి కొద్ది దూరం ముందే ఆపేశారని మీడియా ప్రతినిధులు పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment