కేరళ అసెంబ్లీకి వారసుల పోటీ
తిరువనంతపురం: దేశంలో వారసత్వ రాజకీయాలకు తెరదించాలని ఎవరు ఎంత మొత్తుకున్నా అనాదిగా వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. మే 16, 27న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కేరళలో కూడా 140 స్థానాలకుగాను ఎక్కువ మంది రాజకీయ వారసులు పోటీలో ఉన్నారు. సహజంగానే అధికార పక్షమైన యూడిఎఫ్ నుంచే ఎక్కువ మంది రాజకీయ వారసులు పోటీ చేస్తున్నారు. రెండో స్థానంలో ప్రతిపక్ష ఎల్‌డీఎఫ్ నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయ వారసత్వం అనకపోవచ్చేమోగానీ ఈసారి సముచిత స్థానాలను దక్కించుకోవాలని ఆశిస్తున్న బీజేపీ నుంచి భార్యా భర్తలు పోటీ చేస్తున్నారు.
యూడీఎఫ్ నుంచి మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రుల సంబంధీకులు 17 మంది పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకుడు కే. కరుణాకరన్ కూతురు పద్మజా వేణుగోపాల్ త్రిస్సూర్ నియోజక వర్గం నుంచి, కుమారుడు కే. మురళీధరన్ వట్టియురుకావు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, మాజీ సీఎం మొహమ్మద్ కోయ కుమారుడు ఎంకే మునీర్, మాజీ డిప్యూటి సీఎం అవుకాది కుట్టి నహా కుమారుడు పీకే అబ్దూరబ్బ్, మాజీ మంత్రి టీఎం జాకబ్ కుమారుడు అనూప్ జాకోబ్, మాజీ ఎమ్మెల్యే జార్జ్ ఈడెన్ కుమారుడు హిబీ ఈడెన్, మాజీ మంత్రి బేబీ జాన్ కుమారుడు శిబూ బేబీ జాన్, మాజీ మంత్రి పీఆర్. కురూప్ కుమారుడు కేపీ మోహనన్, ఎంపీ వీరేంద్ర కుమార్ కుమారుడు ఎంవీ. శ్రేయమ్స్ కుమార్, మాజీ మంత్రి కే. నారాయణ కురూప్ కుమారుడు డాక్టర్ ఎన్. జయరాజ్, మాజీ ఎమ్మెల్యే పీ.సీతిహజి కుమారుడు పీ.బషీర్, మాజీ స్పీకర్ కార్తికేయన్ కుమారుడు కేఎస్. శబరినాథన్, మాజీ మంత్రి ఎన్. రామకష్ణన్ కూతురు అమతా రామకష్ణన్, మాజీ ఎమ్మెల్యే తొప్పిలి రవి కుమారుడు సూరజ్ రవి, మాజీ ఎమ్మెల్యే కేకే. థామస్ కుమారుడు సిరియాక్ థామస్, మంత్రి ఆర్యదన్ మొహమ్మద్ కుమారుడు ఆర్యదన్ షౌకత్, మాజీ ఎమ్మెల్యే కేసీ. చరియన్ భార్య మరియమ్మ చరియన్‌లు పోటీ చేస్తున్నారు.
ప్రతిపక్ష ఎల్‌డీఎఫ్ నుంచి ఎనిమిది మంది వారసులు పోటీలో ఉన్నారు. మాజీ మంత్రి ఆర్ బాలకష్ణ పిళ్లై కుమారుడు కేబీ. గణేష్ కుమార్, మాజీ మంత్రి నీలాలోహిత్ దాస్ భార్య జమీలా ప్రకాశమ్, మాజీ సీఎం పీకే. వాసుదేవన్ నాయర్ కూతురు శారదా మోహన్, మాజీ మంత్రి ఎంవీ. రాఘవన్ కుమారుడు ఎంవీ. నికేష్ కుమార్, మాజీ మంత్రి వీకే. రాజన్ కుమారుడు వీఆర్. సునీల్ కుమార్, మాజీ మంత్రి కేఎం. జార్జి కుమారుడు కే. ఫ్రాన్సిస్ జార్జి, మాజీ ఎమ్మెల్యే పీఐ. పాలోజ్ కుమారుడు సజూ పాల్, మాజీ ఎమ్మెల్లే ఎంకే. కేశవన్ కుమారుడు కే. అజిత్ పోటీ చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి శోభా సురేంద్రన్ పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, ఆమె భర్త కేకే. సురేంద్రన్ పొన్నాని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.