బాలికను బెదిరించి రెమో బుక్కయ్యాడు
బాలికను బెదిరించి రెమో బుక్కయ్యాడు
Published Sat, Dec 19 2015 4:30 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
పనాజి: 'అది అరబిక్ కడలందం' అంటూ తెలుగు సినీ సంగీత ప్రియులకు పరిచయమైన ప్రఖ్యాత పాప్ గాయకుడు రెమో ఫెర్నాండెజ్ (62) పై గోవాలో కేసు నమోదైంది. తన కొడుకుపై ఫిర్యాదు చేసిన ఓ బాలికను బెదిరించి అడ్డంగా బుక్కయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని కేసును ఉపహంహరించుకోవాలని రెమో బెదిరించాడని, భయపెట్టి, దుర్భాషలాడాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి జివ్బా దాల్వి తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం రెమోకు అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్నామని తెలిపారు.
డిశెంబర్ 2వ తేదీన రెమో కొడుకు జోనాద్ నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసి ఓ బాలికను గాయపరిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె గోవాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడంటూ జోనాద్ పై మపుసా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ప్రమాదం జరిగిన మరునాడు రెమో ఆ అమ్మాయిని బెదిరించినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది.
అయితే ప్రస్తుతం యూరోప్ ట్రిప్ లో ఉన్న రెమో ఈ ఆరోపణలను ఖండించాడు. వాస్తవాలను పక్కదోవ పట్టించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అతడు మండిపడ్డాడు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు పేర్కొన్నాడు.
Advertisement
Advertisement