
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్ ప్రగతి ప్రయాణంలో 2018, ఏప్రిల్ 28 మరిచిపోలేని చరిత్రాత్మక రోజు. అనేక మంది భారతీయుల జీవితాలు సమూలంగా మారిపోయేందుకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్న రోజు. భారత దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు వ్యాఖ్యానించారు. ఆఖరికి కరెంట్ అంటే తెలియని మణిపూర్‌లోని లైలాంగ్ గ్రామానికి కూడా కరెంట్ వచ్చిందని, ఇందుకు కషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు ఇంకా 12 రోజులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుందని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్కేసింగ్ వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత ఇతర మంత్రులందరూ ప్రభుత్వాన్ని అభినందిస్తూ స్వీట్లు పంచుకున్నారు. ‘దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం లభించింది’ అని ప్రధాని మోదీ స్వయంగా పేర్కొన్నారు. అంటే దేశం నూటికి నూరుపాళ్లు విద్యుత్ సౌకర్యాన్ని సాధించినట్లే. అవునా, నిజమేనా!? అవునంటే మనం చీకట్లో కాలేసినట్లే. విద్యుత్ బల్బును చెవిలో పెట్టుకున్నట్లే. నేటికి కూడా కొన్ని వందల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. గూగుల్‌లో వెతికి ఆ గ్రామాలను తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. విద్యుత్ సౌకర్యం ఉన్న అనేక గ్రామాలకు రోజుకు మూడు గంటలు కూడా విద్యుత్ సరఫరా లేక కొన్ని వేల గ్రామాలు చీకటిలో మగ్గుతున్నాయి.
దేశంలో మూడు కోట్లకుపైగా ఇళ్లకు విద్యుత్ సరఫరానే లేదు. పైగా విద్యుత్ సౌకర్యం లెక్కలే కాకి లెక్కలు. రెండు రకాలుగా వీటిని లెక్కిస్తారు. గ్రామంలోని పది శాతం ఇళ్లకు కరెంట్ సౌకర్యం ఉంటే ఆ గ్రామానికి నూటికి నూరు శాతం విద్యుత్ ఉన్నట్లే లెక్క. ప్రభుత్వ పాఠశాల, పంచాయతీ ఆఫీసు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల ఆస్పత్రి ఇలా ప్రభుత్వ సంస్థలకు విద్యుత్ సౌకర్యం ఉన్నా, ఆ గ్రామానికి నూటికి నూరు శాతం విద్యుత్ సౌకర్యం ఉన్నట్లే. దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంలో 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ విద్యుద్దీకరణ పథకాన్ని చేపట్టింది. అప్పటి నుంచి 2014 సంవత్సరాల మధ్య ఆ ప్రభుత్వం 1,08,280 గ్రామీలకు విద్యుత్ సౌకర్యం కల్పించింది.
ఏటా 12,030 గ్రామాలకు చొప్పున విద్యుత్ సౌకర్యాన్ని కల్పించింది. లక్ష్య సాధనలో 18, 452 గ్రామాల విద్యుద్దీకరణ మిగిలిపోయిందని నాటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్‌ను అందజేయడం తన లక్ష్యమని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. 2015లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చేసిన ప్రసంగంలో ప్రతి గ్రామానికి వెయ్యి రోజుల్లోగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని శపథం చేశారు. నేడు ఆ లక్ష్యాన్ని 987 రోజుల్లోనే సాధించామని, ఇది మోదీ నాయకత్వం వల్లనే సాధ్యమైందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
నేడు ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం వచ్చిందంటూ దేశమంతా పండుగ చేసుకుంటుంటే రాజీవ్ కుటుంబానికి ‘పవర్’ పోయిందంటూ కాంగ్రెస్ పార్టీ ఏడుస్తూ కూర్చుందంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. అధికారిక లెక్కల ప్రకారం యూపీఏ ప్రభుత్వం మిగిల్చిన 18, 452 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లయితే మోదీ ప్రభుత్వం ఏటా 4,613 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు. అదే యూపీఏ ప్రభుత్వం ఏటా 12,030 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించింది.
మధ్యప్రదేశ్‌లో 50 గ్రామాలు నేటికి చీకల్లో....
మధ్యప్రదేశ్‌లో చీకటి ప్రాంతంగా గుర్తింపు పొందిన అలిరాజ్‌పూర్ ప్రాంతాన్ని వెలుగులతో నింపామని ప్రభుత్వం ప్రకటించుకుంది. అదే ప్రాంతంలోని నర్మదా తీరానున్న ఝందన, అంబా, చమేలి తదితర ఐదు దళిత గ్రామాలకు కరెంట్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఐదు గ్రామాల్లో ఒక గ్రామానికి మాత్రం రెండేళ్ల క్రితం విద్యుత్ స్తంభాలు వేశారట. నేటికి విద్యుత్ సౌకర్యం మాత్రం కల్పించలేదు. ఇదే రాష్ట్రంలోని రైసేన్ ప్రాంతంలో దాదాపు 50 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సాంచి నియోజకవర్గంలోని జైత్‌గఢ్, బిలి, పాండ్, రామ్‌గఢ్, ఖానన్‌పురా, గోపాల్ పూర్ అనే గ్రామాలకు కరెంట్ ఇవ్వడానికి కనీసం ప్రయత్నాలు కూడా జరుగలేదు. విద్యుత్ సౌకర్యం సంగతి పక్కన పెడితే తమ గ్రామాలకు సరైన రోడ్డుగానీ, మంచినీటి సౌకర్యంగానీ లేదని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో......
రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్‌పూర్ ప్రాంతంలోని ఘురాయియా, హతియాకర్, కెహరీకా నగ్లా, రాజ్‌ఘాట్, హరీపురా, గోల్ కా పుర, శంకర్ పుర, ఠకూర్ పుర తదితర ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం లేదు. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషేడ్‌పూర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని సప్రమ్ అనే పెద్ద గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేదు. గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో గ్రామానికి రైల్వే స్టేషన్ సౌకర్యం కూడా ఉంది. ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రే రెండు, మూడు సార్లు హామీ ఇచ్చారట. రెండేళ్ల క్రితమే విద్యుత్ స్తంభాలు పాతినప్పటికీ నేటికి కరంట్ సౌకర్యం లేదని మీడియాకు ప్రజలు ఫిర్యాదు చేశారు. ఇలా మీడియా చొచ్చుకుపోయిన ప్రతి రాష్ట్రంలో కరెంట్ నోచుకోని గ్రామాలు ఎన్నో కనిపించాయి. ప్రభుత్వం ప్రకటించిన డేటా ప్రకారమే బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో 40 శాతం ఇళ్లలో నేటికి విద్యుత్ సౌకర్యం లేదు. వాటిల్లో సమీపంలో పవర్ గ్రిడ్లు, విద్యుత్ స్తంభాల సౌకర్యం లేకనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు.

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తున్న కూలీలు

దీపం వెలుతురులో చదువుకుంటున్న చిన్నారులు
Comments
Please login to add a commentAdd a comment