
శివాజీనగర (బెంగళూరు): పత్రికా సంపాదకురాలు గౌరీ లంకేశ్ హత్య విషయంలో ప్రధాని మోదీపై నటుడు ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గౌరి మరణాన్ని సంబరంగా జరుపుకుంటున్న వారెవరనేది సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తూనే ఉందనీ, అయినా మోదీ కళ్లు మూసుకుని మౌనం వహిస్తూ గొప్పగా నటిస్తున్నారని ప్రకాశ్‌రాజ్ అన్నారు. మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘నేను మీ కన్నా గొప్ప నటుడిని. నా ముందు నటించాలని యత్నించకండి. నటుడిగా నన్ను గౌరవించండి.
నటన గురించి మీకేమీ తెలియకపోయినా మీరు నటిస్తున్నారంటే...యువతరం, నేను, జనాలు పిచ్చివాళ్లమని మీరు భావిస్తున్నారా? మీరు నాకన్నా గొప్పగా నటిస్తున్నారు. నాకు వచ్చిన ఐదు జాతీయ అవార్డులు మీకే ఇచ్చేయాలనిపిస్తోంది’ అని అన్నారు. మతవాద సంస్థలకు వ్యతిరేకంగా వార్తలు రాసిన గౌరీని కొందరు దుండగులు సెప్టెంబరు 5న రాత్రి ఆమె ఇంటివద్దనే చాలా దగ్గరి నుంచి తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే.
సీపీఎంకు చెందిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సదస్సును ఆదివారం ప్రారంభించిన అనంతరం ప్రకాశ్‌రాజ్ మాట్లాడారు. ‘నేను చెప్పేదేంటంటే ఆమెను చంపిందెవరనేది ముఖ్యం కాదు. ట్వీటర్‌లో ఆమె మరణాన్ని వేడుకగా జరుపుకుంటున్నవారెవరో కనిపిస్తూనే ఉంది. చంపినవారెవరో గుర్తించడానికి సాక్ష్యాలు లేకపోవచ్చు. కానీ ఆ మరణాన్ని కొందరు సంబంరంగా జరుపుకుంటున్నా, ఒక్క మాట మాట్లాడుకుండా కళ్లు మూసుకుని మౌనం వహిస్తున్న ప్రధాని మనకు ఉన్నారు’ అంటూ ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గౌరీలంకేశ్ తనకు సన్నిహితురాలని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు.