తిరువనంతపురం : కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పైనాపిల్ బాంబును తినిపించి చంపిన ఘటనలో కొత్త విషయం వెలుగులో వచ్చింది. ఇన్ని రోజులు పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్ తినడం వల్ల ఏనుగు చావుకు కారణమయ్యిందని అందరూ అనుకుంటుండగా.. తాజాగా టపాకాయలు నింపిన కొబ్బరికాయను తిని ఏనుగు మరణించిందని అటవీశాఖ అధికారి సునీల్ కుమార్ వెల్లడించారు. ఏనుగు చనిపోయిన ఘటనపై యావత్ దేశం స్పందిస్తూ, అన్యాయంగా మూగజీవిని పొట్టనపెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏనుగు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేసుతో సంబంధం ఉన్న ఒకరిని నిన్న(శుక్రవారం) అరెస్టు చేశారు. (ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: షాకింగ్ నిజాలు)
సాక్ష్యాల సేకరణలో భాగంగా అధికారులు నిందితుడిని పేలుడు పదార్థాలు తయారు చేసే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ విషయంపై అధికారి మాట్లాడుతూ.. ‘కేసు దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిన వ్యక్తిని ప్లాంటేషన్ షెడ్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతను మరో ఇద్దరికి బాంబులు తయారు చేయడంలో సహాయం చేస్తున్నాడు.’ అని పేర్కొన్నారు. నిందితుడి పేరు విల్సన్‌గా, ఇతడు చెట్ల నుంచి రబ్బరు తీసేవాడుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేసులో మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. (ఏనుగు మృతి కేసులో తొలి అరెస్టు)
కాగా.. క్రూరమైన అడవి జంతువుల నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు స్థానికులు టపాకాయలు తయారు చేసి పండ్లు, జంతువుల కొవ్వులో నింపి ఉచ్చులుగా ఉంచుతారు. ఈ క్రమంలో ఏనుగు పేలుడు పదార్థంతో నింపిన కొబ్బరికాయను తినడం వల్ల అది ఏనుగు నోటిని పూర్తిగా గాయపరిచింది. ఇలా విపరీతమైన నొప్పితో బాధపడుతున్న ఏనుగు కొన్ని రోజులుగా ఆహారం, నీరు తీసుకోకుండా ఇబ్బంది పడింది. తీవ్రమైన గాయాలతో పాలక్కాడ్‌లోని వెల్లార్ నదిలోకి దిగిన ఏనుగు రోజంతా అలాగే ఉండి నీరసంతో చివరికి మరణించింది.అయితే ఏనుగు 20 రోజుల క్రితం గాయపడినట్లు, అప్పటి నుంచి ఆకలితో ఉండి మరణించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. (అమానుష ఘటనపై రతన్ టాటా ఆవేదన)
Comments
Please login to add a commentAdd a comment