
సియాచిన్‌లో సైనికులతో కరచాలనం చేస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం సందర్శించారు. ఇక్కడ పర్యటించిన రెండో రాష్ట్రపతి కోవిందే కావడం విశేషం. ఇంతకు ముందు 2004లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. సైనికులను ఉద్దేశించి కోవింద్ ప్రసంగిస్తూ..గత 34 ఏళ్లుగా సియాచిన్‌లో సేవలందిస్తున్న జవాన్ల అసమాన ధైర్య సాహసాలే మన సరిహద్దులు సురక్షితమన్న విశ్వాసాన్ని భారతీయుల్లో నింపాయని అన్నారు. సైనికులు, వారి కుటుంబాలకు భారత ప్రభుత్వం, ప్రజలు అండగా ఉన్నారని చెప్పడానికే తానిక్కడికి వచ్చినట్లు తెలిపారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలందిస్తున్న జవాన్లందరికీ ఆర్మీ సుప్రీం కమాండర్, రాష్ట్రపతి హోదాలో భారత ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వీలు చిక్కినప్పుడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు రావాలని వారిని ఆహ్వానించారు. సియాచిన్ బేస్ క్యాంపునకు సమీపంలోని కుమార్ పోస్ట్‌ను కూడా కోవింద్ సందర్శించారు. రాష్ట్రపతి వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, లెఫ్టినెంట్ జనరల్ డి. అన్బు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో 2 వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ పోస్టుల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 52 డిగ్రీల వరకు పడిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment