న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఒకే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ఆర్డినెన్స్పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. నీట్ ఆర్డినెన్స్ ఫైల్పై ఆయన మంగళవారం ఉదయం సంతకం చేశారు. కాగా ప్రణబ్ ఇవాళ చైనా పర్యటనకు వెళ్తుండడంతో ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్రం పావులు కదిపింది. (ఆర్డినెన్స్ పూర్తి పాఠానికి ఇక్కడ క్లిక్ చేయండి)
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలతో పాటు డీమ్డ్ వర్సిటీల్లో నీట్ ద్వారా ప్రవేశాలు కల్పించాల్సిందేనన్న సుప్రీం తీర్పులో మార్పులు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నీట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాల సీట్లతో పాటు ప్రైవేట్ కాలేజీల్లో రాష్ట్రాల కోటా సీట్లనూ మినహాయించారు.
కాగా ఆర్డినెన్స్ ఆమోదంతో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల విద్యార్థులు ఈ ఏడాది తప్పనిసరిగా నీట్ రాయాల్సిన అవసరం ఉండదు. అయితే.. వారు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎంసెట్ వంటి రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అలాగే.. ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల్లో ప్రభుత్వ కోటా మినహా మిగతా సీట్లన్నిటికీ(మేనేజ్‌మెంట్ కోటాకు) నీట్ వర్తిస్తుంది. అంటే.. విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లోని ప్రభుత్వ(కన్వీనర్) కోటా సీట్లలో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష రాయాలి. ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో ప్రవేశానికి ‘నీట్’ రాయాల్సి ఉంటుంది.