న్యూఢిల్లీ : నీట్ ఆర్డినెన్స్కు చట్టబద్ధత ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. కేంద్ర ప్రభుత్వం నీట్కు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. నీట్ ఆర్డినెన్స్పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జేపీ నడ్డా ...నీట్ ఆర్డినెన్స్పై వివరణ ఇచ్చారు. ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారన్నారు.
నీట్పై కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాని జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రాల అభ్యంతరాలతో ఆర్డినెన్స్ను తీసుకు వచ్చామని ఆయన తెలిపారు. రాష్ట్రాల వాదనతో పాటు, సిలబస్లో మార్పు అంశాన్ని తాము పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అయితే ఇప్పటికే ఏడు రాష్ట్రాలు నీట్ నిర్వహణకు అంగీకరించాయన్నారు. జూలై 24న నీట్-2 పరీక్ష యథాతథంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ప్రభుత్వ కళాశాలకు నీట్ పై మినహాయింపు ఉందన్నారు.
అయితే నీట్పై వస్తున్న ఊహాగానాలు సరికాదన్నారు. ప్రయివేట్ కళాశాలలు, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ సీట్లు నీట్ కిందకే వస్తాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ తర్వాత పీజీ పరీక్షలు కూడా నీట్ కిందకే వస్తాయని నడ్డా పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రాంతీయ భాషల్లో నీట్ నిర్వహిస్తామన్నారు. కాగా నీట్-1 పరీక్షకు ఇప్పటికే ఆరులక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారన్నారు. నీట్ ద్వారా సీట్ల భర్తీలో పారదర్శకత వస్తుందని నడ్డా అభిప్రాయపడ్డారు.