న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 9 నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 9 నుంచి 16 వరకు ఫ్రాన్స్, జర్మనీ, కెనడాల్లో మోదీ పర్యటించి ఆయా దేశాధినేతలతో చర్చలు జరుపుతారు. ఎనిమిది రోజులపాటు సాగే ఈ పర్యటనలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ద్వైపాక్షిక సంబంధాలు బలపరచుకోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం వంటి అంశాలపై ఆయన ప్రధానంగా చర్చిస్తారు. తొలుత ఏప్రిల్ 9 నుంచి ఫ్రాన్స్‌లో, 12 నుంచి జర్మనీలో, 14 నుంచి కెనడాల్లో మోదీ పర్యటన సాగుతుంది. ఇందులో భాగంగా జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌తో, కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్‌లతో మోదీ సమావేశమవుతారు.