100 సంస్థలను ప్రైవేటు పరం చేయండి
► కేంద్రానికి సీఐఐ విజ్ఞప్తి
► పీపీపీపై 50 రైల్వే స్టేషన్ల నిర్మాణానికి వినతి
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 1వ తేదీన వార్షిక బడ్జెట్ సమర్పిస్తున్న నేపథ్యంలో– పారిశ్రామిక సంస్థ సీఐఐ తన కోర్కెల చిట్టాను ఆయన ముందు ఉంచింది. ఎయిర్ ఇండియా, అశోకా హోటెల్స్ సహా 100 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, 2017 ముగిసే నాటికి ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) 50 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించటం ఇందులో కొన్ని. సీసీఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ తెలిపిన సమాచారాన్ని బట్టి మరిన్ని ఈ పారిశ్రామిక సమాఖ్య కోర్కెలను చూస్తే–
♦ పీపీపీతో ముడివడి ఉన్న అన్ని పెండింగ్ వివాదాల పరిష్కారానికి పెద్దపీట వేయాలి. ఇది ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను మెరుగుపరుస్తుంది. దీనితో పెట్టుబడులు పెరిగి, ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుంది.
♦ 2015 డిసెంబర్‌లో ఫైనాన్షియల్ కార్యదర్శి విజయ్ కేల్కర్ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసిన విధంగా వివిధ రంగాల్లో పీపీపీ ప్రాజెక్టుల పరిశీలనకు స్వతంత్ర రెగ్యులేటర్లను ఏర్పాటు చేయాలి. తద్వారా సత్వర నిర్ణయాలకు మార్గం సుగమం చేయాలి.
♦ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నష్టదాయక కంపెనీలనే కాకుండా, లాభదాయక కంపెనీలను సైతం ప్రైవేటు పరం చేయాలి.