ముంబై: ఒక క్రీడాకారిణి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని నిర్మించిన ‘మేరీ కోమ్’ సినిమాను మామూలు సినిమాల్లా పరిగణించవద్దని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కోరింది. ఒలంపిక్స్‌లో మెడల్ సాధించిన మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవిత చరిత్రను ఆధారంగా ఈ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇందులో మేరీకోమ్‌గా ప్రియాంక చోప్రా నటించింది. పరుగుల వీరుడు మిల్కా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమై గతేడాది విడుదలైన ‘భాగ్ మిల్కా భాగ్’ పలు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆ సినిమాతో మేరీకోమ్ సినిమాను పోల్చడం సరికాదని ప్రియాంక అభిప్రాయపడింది. దేశంలో మొదటిసారి ఒక మహిళా క్రీడాకారిణి జీవితాన్ని ఆధారంగా తీసిన ఈ సినిమాను వేరే సినిమాలతో పోలిస్తే అది ఆమెను అవమానించినట్లే అవుతుందని ప్రియాంక స్పష్టం చేసింది. మేరీకోమ్ మనజాతి గర్వించదగ్గ క్రీడాకారిణి.. అని ఆమె వ్యాఖ్యానించింది. ముంబైలో బుధవారం ‘మేరీకోమ్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తన నటజీవితంలో ఈ సినిమాకు కష్టపడినట్లు దేనికీ కష్టపడలేదని చెప్పింది. మేరీ వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది.
ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి క్రీడా ప్రపంచంలో రాణించడమంటే మాటలు కాదని, అటువంటి అద్భుతాన్ని మేరీ సాధించిందని ఆమెను ప్రియాంక పొగడ్తల్లో ముంచెత్తింది. ఈ సినిమాలో మేరీలా శరీరాకృతిని ప్రదర్శించడానికి రోజూ 15 గంటలపాటు శిక్షణ పొందాల్సి వచ్చిందని తెలిపింది. బాక్సింగ్‌లో ప్రవేశించేందుకు మేరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, ఆమె తండ్రి బాక్సింగ్ వద్దని కట్టడి చేసినా పట్టుదలగా నేర్చుకుని ప్రపంచస్థాయిలో భారత్ కీర్తిపతాకం ఎగిరేలా ఒలంపిక్స్‌లో పతకం సాధించిందని ప్రియాంక వివరించింది. ఈ సినిమాకు డెరైక్టర్ దేబుటంగే ఒమాంగ్ కుమార్. సెప్టెంబర్ 5వ తేదీన ఇది థియేటర్లలో విడుదల కానుంది.
సాధారణ చిత్రం కాదు..
Published Wed, Jul 23 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement
Advertisement