భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన ప్రకటన చేసింది. ఇకపై బాక్సింగ్ రింగ్‌లోకి దిగేది లేదని ప్రకటించింది. వయో పరిమితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అన్ని కేటగిరీల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది.
భవిష్యత్‌లో బాక్సింగ్‌తో అనుసంధానమై ఉంటానని తెలిపింది. కాగా, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిబంధనల ప్రకారం 40 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు ప్రొఫెషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లలో పాల్గొనడానికి అనుమతి లేదు. గతేడాదే ఏజ్ లిమిట్‌ను దాటిన 41 ఏళ్ల మేరీ కోమ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది.
మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, ఒలింపిక్ విన్నర్‌గా (2012 ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకం) నిలిచిన కోమ్.. పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి చాలా సందర్భాల్లో విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది.
ఓవరాల్‌గా మేరీ కోమ్ తన కెరీర్‌లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మేరీ కోమ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్ రింగ్‌లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment