ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ ఈ ఏడాది జరగనున్న ఆసియా క్రీడల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయి. గతేడాది కామన్‌వెల్త్ క్రీడల సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా ఆమె ఎడమ మోకాలికి గాయమై శస్త్రచికిత్స చేయించుకుంది. అప్పటినుంచి మేరీకోమ్ బరిలోకి దిగలేదు. అయితే తాజాగా సెప్టెంబర్ 23న మొదలుకానున్న ఆసియా క్రీడల్లో పాల్గొనాలని మేరీకోమ్ భావిస్తోంది.
అయితే నిబంధనల ప్రకారం 40 ఏళ్లు పైబడిన బాక్సర్లు పోటీల్లో పాల్గొనేందుకు ఆస్కారం లేదు. ఇప్పటికే మేరీకోమ్ వయస్సు 40 ఏళ్లు. ఈ ఏడాది నవంబర్‌లో మేరీకోమ్‌కు 41 ఏళ్లు నిండనున్నాయి. అందుకే బహుశా ఆమెకు ఆసియా క్రీడల్లో చివరిసారి బరిలోకి దిగే చాన్స్ ఉంది. కాగా ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మేరీకోమ్ పాల్గొంది.
ఆమె మాట్లాడుతూ.. ''కామన్‌వెల్త్ క్రీడల ట్రయల్స్ సందర్భంగా దురదృష్టవశాత్తూ గాయమైంది. శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. తిరిగి రింగ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నా.నాకు ఏడాది మాత్రమే మిగిలి ఉంది. వచ్చే ఏడాది రిటైర్ కావాల్సిందే. కాబట్టి వీడ్కోలుకు ముందు టోర్నీలో ఆడాలనుకుంటున్నా. మరో ఐదేళ్ల పాటు బాక్సింగ్ రింగ్‌లో కొనసాగాలని ఉన్నా నిబంధనల ప్రకారం 40 ఏళ్లు పైబడితే ఆటకు దూరమవక తప్పదు. ఇప్పుడు నా ప్రధాన లక్ష్యం ఆసియా క్రీడలు. అప్పటివరకు పూర్తిగా కోలుకుంటాననే నమ్మకం ఉంది. ఒకవేళ ఆసియా క్రీడలకు అర్హత సాధించకపోతే చివరగా ఏదైనా అంతర్జాతీయ టోర్నీలో పోటీపడాలనుంది'' అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment