
జడ్జీల నియామకాల్ని హైజాక్ చేయలేరు: చీఫ్ జస్టిస్ ఠాకూర్
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియను హైజాక్ చేయలేరని, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. జడ్జీల ఎంపిక విషయంలో కార్యనిర్వాహక వ్యవస్థపై న్యాయవ్యవస్థ ఆధారపడకూడదని ఆయన పేర్కొన్నారు. భీమ్‌సేన్ సచార్ మెమోరియల్‌లో ‘స్వతంత్ర న్యాయవ్యవస్థ-ప్రజాస్వామ్యానికి పరిరక్షణ’ అంశంపై గురువారం మాట్లాడుతూ... న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించకపోతే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులకు అర్థం ఉండదన్నారు.
అన్నింటి కంటే స్వతంత్య్ర న్యాయ వ్యవస్థే ప్రజాస్వామ్యానికి ముఖ్యమని జస్టిస్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. నియమకాల పక్రియను హైజాక్ చేయడం ద్వారా న్యాయవ్యవస్థ ప్రభావితమయ్యే పరిస్థితి రాకూడదని ఎన్‌జేఏసీపై విచారించిన రాజ్యాంగం ధర్మాసనం అభిప్రాయపడిందని తెలిపారు. న్యాయ శాఖ మంత్రి, ప్రభుత్వం నియమించిన ప్రతినిధులు జడ్జీలను ఎంపిక చేయడం స్వతంత్ర న్యాయవ్యవస్థకు విఘాతమని ఠాకూర్ పేర్కొన్నారు.