సాక్షి, ముంబై: వాహనచోరులను అరికట్టడానికి ప్రభుత్వం ‘హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్’ (హెచ్‌ఎస్‌ఎన్‌పీ)లను వాహనాలకు అమర్చనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాహనాలకు ఈ నంబర్ ప్లేట్లను అమర్చనున్నారు. దీనికోసం టెండర్లను ఆహ్వానించగా ఐదు కంపెనీలు బిడ్‌లు వేశాయి. బిడ్‌లను పరిశీలించేందుకు గాను ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రవాణా శాఖ కూడా ఐదు కంపెనీలు అందజేసిన సాంకేతికమైన బిడ్లను ఇంతకు ముందే ప్రారంభించింది. ఇదిలావుండగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్ల వాహనాలకు హెచ్‌ఎస్‌ఎన్‌పీ నంబర్ ప్లేట్లను అమర్చనున్నారు.
మరో మూడు-నాలుగు నెలల్లో ఈ పనులను ప్రారంభించనున్నట్లు అధికారి తెలిపారు. బిడ్డర్ల ఒప్పందంపై ప్రభుత్వం సంతకం చేసిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు. వాహనాల దొంగతనాలను అరికట్టే ఉద్దేశ్యంతో ఈ టాంపర్ ప్రూఫ్ హెచ్‌ఎస్‌ఎన్‌పీలను వాహనాలకు అమర్చనున్నారు. వీటి అమరికతో మున్ముందు వాహనాలకు భద్రత ఏర్పడనుందని అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికోసం ఏడు డిజిటల్ యూనిక్ సీరియల్ నంబర్లను కేటాయించనున్నారు.
ఇదిలా వుండగా, ద్విచక్ర వాహనాలకు హెచ్‌ఎస్‌ఎన్‌పీ లకుగాను రూ.150 ఖర్చుకాగా, లైట్, భారీ వాహనాలకు రూ.200 నుంచి రూ.400 వరకు ఖర్చు కానుం దని అధికారి తెలిపారు. హెచ్‌ఎస్‌ఎన్‌పీ నంబర్ ప్లేట్లను వాహనాలకు ముందు, వెనుక భాగంలో అమర్చనున్నారు. నాలుగు చక్రవాహనాల విండ్ స్క్రీన్‌పై నంబర్ ప్లేట్ ట్యాగ్‌ను అమర్చనున్నారు. ఇదిలా వుండగా ఈ నంబర్ ప్లేట్లను ఆర్టీవో పరిధిలోని అధికారిక డీలర్లే అమర్చాల్సి ఉంటుందని అధికారి తెలిపారు.
హై సెక్యురిటీ నంబర్ ప్లేట్ల వివరాలివి...
అల్యూమినియం మిశ్రమ లోహంతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. అశోక చక్ర హోలోగ్రాం ఉంటుంది. అదేవిధంగా నీలిరంగులో ‘ఇండియా’ అని ఆంగ్ల పదాలతో స్టాంప్ కూడా వేయనున్నారు.
వాహనదొంగలకు చెక్..!
Published Sun, Jul 20 2014 11:30 PM | Last Updated on Thu, May 24 2018 1:57 PM
Advertisement
Advertisement