
రోజుకూలీ ఖాతాలో కోటి రూపాయలు!
లుథియానా: ఆదాయపన్ను శాఖ అధికారులు పంపిన నోటీసు చూసి అతడుగాడు నోరెళ్లబెట్టగాడు. ఐటీ నోటీసు అందుకున్న అతడు సాఫ్ట్ వేర్ ఉద్యోగో, ప్రభుత్వ ఉద్యోగో కాదు. రోజువారి కూలీ. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ కు చెందిన అతడికి రూ.40 లక్షల పన్ను కట్టాలని ఐటీ అధికారులు నోటీసు పంపడంతో అవాక్కయ్యాడు. అతడి బ్యాంకు ఖాతాలో కోటి రూపాయలున్నాయని, దానికి పన్ను కట్టాలని తాఖీదు పంపడంతో కంగుతిన్నాడు.
నెలకు రూ. 8 వేల సంపాదనతో నెట్టుకొస్తున్న తనకు బ్యాంకు ఖాతాయే లేదని, తానెప్పుడు బ్యాంకులో డబ్బు జమ చేయలేదని అధికారులకు అతడు తెలిపాడు. ఎన్ను ఎగవేసేందుకు కొంతమంది అక్రమార్కులు షాడో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పేదల గుర్తింపు, నివాస పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు సాగిస్తున్నట్టు వెల్లడైంది.
ఇలాంటి షాడో బ్యాంకు ఖాతాలు పంజాబ్ లో అధికమయ్యాయి. తీవ్రవాదులకు నిధులు, హవాలా సొమ్ము ఈ ఖాతాల ద్వారా పంపిణీ అయ్యే అవకాశముందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో హవాలా ఆపరేటర్లు, పన్ను ఎగవేతదారులు, బ్యాంకు అధికారులపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. బ్యాంకు అధికారులపై వచ్చిన ఫిర్యాదులను ఆర్ బీఐకి పంపిస్తోంది.