జగన్నాథుడు
భువనేశ్వర్ : జగన్నాథుడు విశ్వ సుందరుడు. ఆయన శోభ సర్వ సహజ సుందరం. గత 15 రోజులుగా అనారోగ్యంతో మంచం పట్టిన భగవంతుడు గురువారంతో పూర్తిగా కోలుకున్నాడు. ఆరోగ్యం కోలుకోవడంతో ముస్తాబై భక్తుల మధ్య శుక్రవారం ప్రత్యక్షమయ్యాడు. స్నాన పూర్ణిమను పురస్కరించుకుని 108 కలశాల సుభాషిత జలాలతో భారీగా స్నానమాచరించిన స్వామి ముఖారవిందం మసకబారిపోయింది.
అనారోగ్యం సోకడంతో ముఖం కకావికలంగా మారడంతో చీకటి మండపంలో తెరమరుగయ్యాడు. గోప్య సేవలు, ఉపచారాలతో కోలుకున్న మర్నాడే యథాతథంగా ముస్తాబై ప్రత్యక్షమై భక్తులకు నవ యవ్వన దర్శనభాగ్యం కల్పించాడు. మహా జలాభిషేకం పురస్కరించుకుని మూల విరాట్ల అలంకారం కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో మూల విరాట్ల పూర్వ కళాకాంతుల్ని తీర్చి దిద్దేందుకు పక్షం రోజులపాటు అనేక ఆచార వ్యవహారాలతో స్వామిని తీర్చిదిద్దారు.
బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుని మూల విరాట్లకు రంగులతో అద్ది తళుక్కుమనిపించేలా అలంకరించారు. ఏటా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక నుంచి తరచూ రత్న వేదికపై మూల విరాట్లను తాత్కాలికంగా అలంకరిస్తూ నిత్య సేవాదులు కొనసాగిస్తారు. ఈ క్రమంలో రథయాత్ర ముందు రోజున స్వామి నూతన అలంకారంతో శోభిల్లి భక్తులకు ముచ్చట గొలిపాడు. కొత్త అలంకారంలో స్వామి యవ్వన పురుషోత్తముడుగా ప్రత్యక్షమయ్యాడని భక్తులు కొనియాడారు.
ఈ నేపథ్యంలో ఈ దర్శనం నవయవ్వన దర్శనంగా వాసికెక్కిది. మూల విరాట్ల అలంకారం ఎంతో గోప్యంగా నిర్వహించారు. వీటిలో జగన్నాథుని చక్ర నయనాల అలంకారం ప్రత్యేకం. భిన్నం. స్వామి నేత్రాలు మినహా ఇతర అలంకారాన్ని ఒక వర్గం సేవాయత్‌లు నిర్వహించారు. కేవలం నయనాలకు మాత్రం ఒక ప్రత్యేక వర్గానికి చెంది అనుభవజ్ఞుడైన సేవకుడు ఒంటరిగా అలంకరించి తీర్చిదిద్దాడు.
చక్రాల కన్నుల స్వామి జగన్నాథుడు. రెప్ప కూడా వాల్చకుండా యావత్తు సృష్టిని జగతి నాథుడు అనుక్షణం శాసిస్తుంటాడనేందుకు ఆ చక్రాల కళ్లు సూచిస్తుంటాయి. ఏ కోణంలో చూసినా జగన్నాథుని సంస్కృతి, ఆచారంలో ఏదో ఒక భిన్నత్వం, సృజనాత్మకత, ఆలోచని స్ఫురింపజేసే వ్యవహారం ప్రతిబింబిస్తుంది.
దక్షిణ ద్వారం గుండా దర్శనం
నవయవ్వన దర్శనాన్ని పురస్కరించుకుని భక్తులు, యాత్రికులను శ్రీ మందిరం దక్షిణ ద్వారం గుండా లోనికి అనుమతించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి దర్శనానికి అనుమతించడం ప్రారంభించారు. భక్తులకు తొలుత పరమాణిక్ దర్శనం (ఆర్జితం) తదుపరి సర్వదర్శనం కల్పించారు.
5 వేల పరమాణిక్ టికెట్లను విక్రయించారు. ఈ ఏడాది పరమాణిక్ టికెట్ ధర రూ.20కి పెంచారు. సర్వ దర్శనం భక్తులను యథాతథంగా శ్రీ మందిరం సింహ ద్వారం నుంచి అనుమతించారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు భిత్తొరొ కఠొ ప్రాంగణం నుంచి మూల విరాట్ల దర్శనానికి చేరువ నుంచి అనుమతించారు. యాత్ర పురస్కరించుకుని ప్రత్యేక సేవలు నిర్వహించే సందర్భంగా జయ–విజయ ద్వారాల్ని మూసి సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేస్తూ అనుమతించారు. ఇలా రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శన సదుపాయం కల్పించారు.
నిర్విరామంగా యాత్ర సన్నాహం
ఏడాదికోసారి స్వామి యాత్రకు బయల్దేరడం భారీ సన్నాహం. పక్షం రోజుల అనారోగ్యం నుంచి కోలుకున్న స్వామి యవ్వన ఉత్సాహంతో శనివారం జరగనున్న రథయాత్ర కోసం అత్యంత ఉత్సాహంతో సన్నాహాల్లో దేవస్థానం కమిటీ తలమునకలైంది. శుక్రవారం రాత్రి అంతా యాత్ర సన్నాహమే. ఏకాంత, పవళింపు సేవలు రద్దు చేసుకుని మర్నాటి యాత్ర కోసం స్వామి సిద్ధం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment