జగన్నాథుని బహుడా యాత్రలో అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు
భువనేశ్వర్/పూరీ: ఒడిశాలోని పూరీలో జగన్నాథుని బహుడా యాత్ర (రథయాత్ర) ఆదివారం ఘనంగా ముగిసింది. శ్రీ గుండిచా మందిరంలో 9 రోజుల కొలువు ముగించుకుని దేవతలు జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, వారి సోదరి సుభద్ర బ్రహ్మాండంగా అలంకరించిన మూడు చెక్క రథాలపై తిరిగి శ్రీ మందిరం (జగన్నాథుని ఆలయం) సింహ ద్వారం ఆవరణకు చేరడంతో బహుడా యాత్ర సమాప్తమైంది. మరో 3 రోజులపాటు శ్రీ మందిరం సింహద్వారం వద్దే రథాలపై దేవుళ్లు కొలువుదీరుతారు. స్వర్ణాలంకారం, అధర పొణా ఉత్సవాల్ని ముగించి నీలాద్రి విజే ఉత్సవంలో మూల విరాట్లను ప్రధాన వేదికకు తరలిస్తారు.
తాళ ధ్వజంలో బలభద్రుడు, దర్ప దళనంలో దేవీ సుభద్ర శ్రీ మందిరం సింహద్వారం ఆవరణకు వడివడిగా చేరారు. నంది ఘోష్ రథంలో జగన్నాథుడు మాత్రం దారిలో లక్ష్మితో భేటీ అయి నిదానంగా ముందుకు సాగాడు. హీరా పంచమిని పురస్కరించుకుని ఆగ్రహించిన మహాలక్ష్మిని బుజ్జగించి నారాయణునితో భేటీ చేయించడం ఈ ఉత్సవం సారాంశం. పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన యాత్రికులతో బొడొదండొ కిటకిటలాడింది. బహుడా రథయాత్ర విజయవంతంగా ముగియడంతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సేవాయత్‌లు, అధికారులకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment