సీబీఐ కార్యాలయం ఎదుట శ్రీజగన్నాథ సేన ప్రదర్శన
భువనేశ్వర్ : శ్రీజగన్నాథుని దేవస్థానం శ్రీమందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతయింది. ఈ తాళం అత్యంత ప్రాచీన ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీ జగన్నాథ సంస్కృతిలో ఈ తాళం చెవిని కుబేర తాళం చెవిగా పేర్కొంటారు. అమూల్యమైన రత్న సంపద రత్న భాండాగారం రక్షణ కోసం వినియోగించే తాళం చెవి కావడంతో దీనికి ఆ ప్రాధాన్యం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీజగన్నాథుని కోషాగారంలో కుబేర తాళం చెవి భద్రపరుస్తారు.
పకడ్బందీ అధికార బందోబస్తు మధ్య దీనిని వినియోగిస్తారు. వినియోగం తర్వాత అదే క్రమంలో ఆలయ సంప్రదాయాలతో చట్టపరమైన మార్గదర్శకాల ఆచరణతో దీనిని పదిలపరచడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కుబేర తాళం చెవి కనిపించక పోవడం సందిగ్ధతని ప్రేరేపిస్తుంది. ఈ తాళం చెవి గల్లంతు విషయం తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘ కాలం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది.
శ్రీజగన్నాథుని భక్త హృదయాలు స్పందించి వీధికి ఎక్కిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయ కమిషన్ విచారణకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ఇదంతా కంటి తుడుపు వ్యవహారంగా శ్రీజగన్నాథ సేన విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఎంత మాత్రం నమ్మశక్యంగా లేవని వివరిస్తు శ్రీజగన్నాథ సేన ప్రముఖుడు ప్రియదర్శి పట్నాయక్ స్థానిక సీబీఐ కార్యాలయానికి విచ్చేసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు దాఖలు చేశారు.
ప్రాచీనమైన కుబేర తాళం చెవి సాధారణమైనది కాదు. 3 అంచెల కొనతో ఒకటిన్నర అడుగుల పొడవైన తాళం చెవి అదృశ్యం కావడం అంటే ఆలోచించాల్సిన విషయంగా సీబీఐ గుర్తించి విచారణకు రంగంలోకి దిగాలని ఆయన సీబీఐ వర్గాలకు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సీబీఐ కార్యాలయం ఎదురుగా సోమవారం శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment