‘జగన్నాథుడికి’ కలప కొరత!
పూరి: ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రకు అవసరమైన కలపకు కొరత ఏర్పడినట్టు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మూడు రథాలతో కూడిన యాత్రకు దేశం సహా విదేశాల నుంచి యాత్రికులు హాజరవుతున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్ 29న ఈ రథాల తయారీ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో రథాలను రూపొందించేందుకు ఆలయ వర్గాలు సమాయత్తమయ్యాయి. అయితే, వీటి కోసం వాడే ప్రధాన దుంగలకు కొరత ఏర్పడింది.
ఈ అంశంపై చర్చించేందుకు రెవెన్యూ డివిజనల్ కమిషనర్ ఎస్.కె. వశిస్ట్ అధ్యక్షతన అధికారులు గురువారం భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. రథ చక్రాలను రూపొందించేందుకు కనీసం 42 భారీస్థాయి దుంగలు అవసరం కాగా, ఒడిశా ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 28 దుంగలనే సరఫరా చేసిందన్నారు. ఏటా రూపొందించే రథాల కోసం వెయ్యి పైగా భారీ వృక్షాలను నరికివేయడంపై పర్యావరణ ప్రేమికులు సహా ఉద్యమ కారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.