పూరీ జగన్నాథ రథయాత్రకు ఉగ్రముప్పు!
పూరీ(ఒడిశా): విశ్వవిఖ్యాత శ్రీ జగన్నాథుని రథయాత్రను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారా? పూరీలో దాడులు చేయాలని ప్లాన్ వేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీంతో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో పూరీ జగన్నాథ రథయాత్రకు భారీ భద్రత కల్పిస్తున్నారు.
జల మార్గంలోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు చొరబడకుండా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఇందులో భాగంగానే‘సౌనక్’ పహరా నౌకను పారాదీప్ ఓడరేవులో నిలిపారు. ‘సౌనక్’కు తోడుగా మరో 2 వేగవంతమైన పెట్రోలింగ్ ఓడలు కూడా చేరాయి. పారాదీప్ నుంచి పూరీ వరకు సువిశాల సముద్ర మార్గంలో ఈ ఓడలు భద్రతా వ్యవహారాల్ని పర్యవేక్షిస్తాయి.
ఇవీ సౌనక్ ప్రత్యేకతలు..
సౌనక్ పూర్తిగా స్వదేశీ తయారీ ఓడ కావడం విశేషం. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 21వ తేదీన కోస్ట్‌గార్డ్ వాహినిలో సౌనక్‌ను చేర్చారు. దీని పొడవు 105 మీటర్లు. 9,100 కిలో వాట్ల శక్తివంతమైన 2 డీజీలు ఇంజిన్లతో సౌనక్ గంటకు 26 నాట్‌ల వేగంతో దూసుకుపోతుంది. 2 తేలికపాటి హెలికాప్టర్లు, 30 ఎం.ఎం. క్లోజ్ రేంజ్ నావికా తుపాకులు, 5 అత్యాధునిక హై–స్పీడ్ పడవలు అనుక్షణం అందుబాటులో ఉంటాయి. సముద్రంలో తైల కాలుష్యం లేకుండా సౌనక్ పని చేయడం మరో విశేషం. విపత్కర పరిస్థితుల్లో తక్షణ సేవలు అందజేసేందుకు దీనిలో 14 మంది కోస్టు గార్డు అధికారులు, 98 మంది జవాన్లను నియమించారు. సముద్ర ఠాణా పోలీసుల సమన్వయంతో సౌనక్ ఓడ రేవు అనుక్షణం అప్రమత్తంగా సముద్ర మార్గం గుండా ఉగ్రవాదుల చొరబాటుపై నిఘా వేస్తుంది.