బోనస్‌ అడిగితే బుల్లెట్లా! | Rahul Gandhi detained by police in MP | Sakshi
Sakshi News home page

బోనస్‌ అడిగితే బుల్లెట్లా!

Published Fri, Jun 9 2017 12:52 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

బోనస్‌ అడిగితే బుల్లెట్లా! - Sakshi

బోనస్‌ అడిగితే బుల్లెట్లా!

ధనికులకు రుణమాఫీ.. రైతులకు తూటాలు
► ఈ ప్రభుత్వం చేస్తోందిదే!
►మంద్‌సౌర్‌ బాధితుల పరామర్శకు వెళ్లిన రాహుల్‌
►అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
► రాహుల్‌ నిర్బంధం.. 4 గంటల తర్వాత విడుదల


నయాగావ్‌: మధ్యప్రదేశ్‌లో పోలీసు కాల్పుల్లో మృతిచెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంద్‌సౌర్‌ వెళ్లటం ఉద్రిక్తతకు దారితీసింది. మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లోని నయాగావ్‌ వద్దే రాహుల్‌ను పోలీసులు అడ్డుకోవటంతో హైడ్రామా నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్‌ నాయకుల మధ్య తోపులాట జరిగింది.

దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయాల్సిందేనని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. రైతులకు వారు పండించిన పంటకు సరైన మొత్తాన్ని ఇవ్వమని అడిగితే.. కేంద్రం బుల్లెట్లతో సమాధానం చెబుతోందని విమర్శించారు. మరోవైపు, మంద్‌సౌర్‌లో రెండుగంటలపాటు కర్ఫ్యూ సడలించారు. పోలీసు కాల్పుల్లోనే ఐదుగురు రైతులు చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

సరిహద్దుల్లో హైడ్రామా!
మధ్యప్రదేశ్‌ సరిహద్దు నుంచి మంద్‌సౌర్‌కు ర్యాలీగా వెళ్లేందుకు రాహుల్‌ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. ‘ధనవంతులకోసమైతే లక్షన్నర కోట్ల విలువైన రుణాలను మోదీ మాఫీ చేస్తారు. కానీ రైతులకు చేయరు. రైతుల పంటకు సరైన మొత్తాన్ని ఇవ్వరు. బోనస్‌ అడిగితే బుల్లెట్లతో సమాధానం చెబుతున్నారు’ అని విమర్శించారు. రాహుల్‌తోపాటుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్, కమల్‌నాథ్, జేడీయూ నేత శరద్‌యాదవ్‌ కూడా కేంద్రంపై నిప్పులు చెరిగారు. అనంతరం వీరి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. మంద్‌సౌర్‌లో కర్ఫ్యూ అమల్లో ఉందని అక్కడికి వెళ్లేందుకు అనుమతివ్వబోమని స్పష్టం చేశారు.

దీంతో కాంగ్రెస్‌ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ముందుకెళ్లేందుకు వీల్లేకపోవటంతో పక్కనున్న పంటపొలాల గుండా వెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసులు, ఆయనతో సహా రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సచిన్‌ పైలట్, మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యే జయవర్ధన్‌ సింగ్‌లను నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరిని సమీపంలోని ఓ సిమెంట్‌ కంపెనీ విశ్రాంతి భవనానికి తరలించారు. అక్కడినుంచే మరణించిన రైతుల కుటుంబాలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. నాలుగు గంటల నిర్బంధం తర్వాత వీరిని పోలీసులు వదిలిపెట్టారు.

తర్వాత మృతుల కుటుంబా లను ఆయన కలిసేందుకు అధికారులు అనుమతించారు. మధ్యప్రదేశ్‌–రాజస్తాన్‌ సరిహద్దుల్లోని దోరియా గ్రామంలో బాధితులను రాహుల్‌ కలిశారు.  ‘రెండు నిమిషాలసేపు మృతుల కుటుంబాలను కలిసి మాట్లాతానని చెప్పాను. ఆ కుటుంబాల బాధను పంచుకుందామనుకున్నాను. నేను భారతీయ పౌరుడిని కాదా? మధ్యప్రదేశ్, యూపీల్లో మేం పర్యటించకూడదా?’ అని ప్రశ్నించారు.

రాహుల్‌ వచ్చారిలా!
మంద్‌సౌర్‌లో రైతులను పరామర్శించేందుకు రాహుల్‌ ఢిల్లీ నుంచి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చార్టడ్‌ విమానంలో వచ్చారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లోని చిత్తోడ్‌గఢ్‌ వరకు రోడ్డు మార్గం ద్వారా కార్లో చేరుకున్నారు. మార్గమధ్యంలో ఓ ధాబాలో కాసేపు ఆగిన తర్వాత మోటర్‌ సైకిల్‌పై ఐదారు కి.మీ. ప్రయాణించి సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడినుంచి దాదాపు 100 మీటర్లు కాలినడక ద్వారా మధ్యప్రదేశ్‌లోకి చేరుకున్నారు. అయితే రాహుల్‌తోపాటుగా ముగ్గురు మోటార్‌ సైకిల్‌పై వెళ్లినట్లు తెలిసిందని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రాజస్తాన్‌ పోలీసులు తెలిపారు.

చర్చలకు రండి!
రైతులు ఆందోళన విరమించాలని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ విజ్ఞప్తి చేశారు. అన్నదాతలతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనన్నారు. ‘మా ప్రభుత్వం, రైతులదే. వారికోసమే మేం పనిచేస్తున్నాం’ అని అందులో చౌహాన్‌ పేర్కొన్నారు. రైతులను రెచ్చగొట్టేందుకే రాహుల్‌ మంద్‌సౌర్‌కు వెళ్లారని కేంద్ర మంత్రి వెంకయ్య విమర్శించారు.

ఈ ఘటనకు బాధ్యులుగా మంద్‌సౌర్‌ కలెక్టర్‌ స్వతంత్ర సింగ్, ఎస్పీ ఓపీ త్రిపాఠీలను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. మూడ్రోజులుగా రైతులు రోడ్లపై వాహనాలను తగలబెడుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఒక పక్క మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో రైతుల ఆందోళనలు జరుగుతుంటే.. బిహార్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ రాందేవ్‌ బాబా ఏర్పాటుచేసిన యోగా శిబిరంలో పాల్గొనటం విమర్శలకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement