
సాక్షి, తిరువనంతపురం : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ’ఆమె’కు అనుకోని విధంగా ఆశ్చర్యంలో ముంచెత్తారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం రిటైర్డ్ నర్సు రాజమ్మ వవాతిల్‌ను కలుసుకుని, ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు. 48 ఏళ్ల క్రితం తన చేతులతో ఎత్తుకున్న ఓ బిడ్డ ఇప్పుడు తనను చూసేందుకు రావడంతో రాజమ్మ ఆనందంలో మునిగి తేలారు. ఇంతకీ ఈ రాజమ్మ ఎవరనుకుంటున్నారా?. 1970 జూన్ 19 రాహుల్ గాంధీ పుట్టినప్పుడు లేబర్ రూమ్‌లో రాజమ్మ నర్సుగా ఉన్నారు.
రాహుల్ జన్మించినప్పుడు ఆమెకు 23 ఏళ్లు. నర్సింగ్‌లో డిగ్రీ చదివిన తర్వాత ఆమె హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో విధులు నిర్వహించారు. రిటైర్మెంట్ అనంతరం ప్రస్తుతం రాజమ్మ భర్తలో కలిసి వయనాడ్‌లో నివసిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ నుంచి ఎంపీగా రాహుల్ పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల సందర‍్భంగా రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ ఢిల్లీ పుట్టాడనటానికి తానే సాక్ష్యమంటూ రాజమ్మ మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.