న్యూఢిల్లీ: పార్లమెంటు దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురుకు అనుకూలంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో నినాదాలు చేసిన వ్యవహారం రోజురోజుకు ముదురుతున్నది. ఈ వ్యవహారంలో ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి దిగగా.. మరోవైపు విద్యార్థులపై పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ జేఎన్‌యూలో ఆందోళనలు ముమ్మరమయ్యాయి.
జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శనివారం యూనివర్సిటీలో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. యూనివర్సిటీలో రాహుల్‌కు నల్లజెండాలు స్వాగతం పలికాయి. ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. రాహుల్ గోబ్యాక్ అని నినాదాలు చేశారు. ఆయన వాహనాన్ని అడ్డుకొని నల్లజెండాలు ప్రదర్శించారు. దీంతో జేఎన్‌యూలో ఉద్రిక్తత నెలకొంది.