జైపూర్ : ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్థిక శాస్త్రం గురించి ఏమీ తెలియదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో దేశ జీడీపీ 9 శాతం వృద్ధితో పరుగులు పెడితే ప్రస్తుతం ఐదు శాతానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత ప్రమాణాలతో జీడీపీని కొలిస్తే కేవలం 2.5 శాతం వృద్ధి రేటే నమోదవుతుందని అంచనా వేశారు. విదేశాల్లో భారత ప్రతిష్టను ప్రధాని మోదీ మంటగలుపుతున్నారని దుయ్యబట్టారు. జైపూర్‌లో మంగళవారం సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన యువ ఆక్రోశ్ ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ ఆర్థిక మందగమనంపై మోదీ సర్కార్ తీరును తప్పుపట్టారు.
ఆర్థిక వ్యవస్థపై మోదీకి ఎలాంటి అవగాహన లేదని, ఆయనకు కనీసం జీఎస్టీ గురించి కూడా ఏమీ తెలియదని అన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో మంచి కంటే కీడే ఎక్కువగా వాటిల్లిందని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారని వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్ ప్రజల మధ్య వైషమ్యాలను ప్రోత్సహిస్తోందని, ఇప్పుడు భారత్ లైంగిక దాడుల హబ్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడరని ఎద్దేవా చేశారు. విశ్వవిద్యాలయాలకు వెళ్లి విద్యార్ధుల ప్రశ్నలు ఎదుర్కోవాలని ప్రధాని మోదీ అందుకు సాహసించరని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment