సాక్షి, ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ యువత భవిష్యత్తును వీరిద్దరూ సంక్షోభంలోకి నెడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ప్రియమైన దేశ యువత.. ప్రధాని మోదీ, అమిత్ షా మీ భవిష్యత్తును ఆంధకారంలోకి నెడుతున్నారు. కలల్ని సాకారం చేసుకోకుండా మీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. మీ కోపాన్ని వారు ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే నిరసనకారులుపై ఉక్కుపాదం మోపుతున్నారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అణచివేతను శాంతియుతమైన నిరసనలతో గెలుద్దాం’ అంటూ ట్విట్ చేశారు.
కాగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన భారీ ర్యాలీలో మోదీ ప్రసంగింస్తూ... సీఏఏ, ఎన్నార్సీ భారతీయ ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారతీయ ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంలో పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులైన నక్సల్స్.. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. అబద్ధాలు ప్రచారం చేసేవాళ్లను నమ్మకండని, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కౌంటర్‌గా రాహుల్ ట్విటర్‌లో స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment