రైళ్లలో పగటి నిద్ర బంద్
► ఇక బెర్తుల్లో రాత్రి 10 నుంచి
► ఉదయం 6 వరకే పడుకోవాలి
► ప్రయాణికుల మధ్య తగాదాల నేపథ్యంలో నిద్రించే సమయం కుదించిన రైల్వే బోర్డు
సాక్షి, హైదరాబాద్: ‘ఉదయం 11 గంటలు.. మిడిల్ బెర్త్ ప్రయాణికుడు పడుకునే ఉండటంతో లోయర్ బెర్త్‌లో కూర్చోడానికి కుదరలేదు.. అలా ఓ వైపు వంగి టీ తాగుతుంటే అది ఒలికి నా ఖరీదైన డ్రెస్ పాడైంది. ఆ నష్టానికి పరిహారం ఎవరిస్తారు’ అంటూ కాజీపేటకు చెందిన ప్రవీణ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
సుబ్బారావు.. ఢిల్లీకి హైదరాబాద్‌లో రైలెక్కాడు.. మిడిల్ బెర్త్ టికెట్.. భోజనం చేయటం, కాలకృత్యాలు తప్ప మిగతా సమయం పడకకే పరిమితమయ్యాడు.. దీంతో లోయర్ బెర్త్‌పై ఇతరులు కూర్చోడానికి కుదరలేదు.. వారు వారించినా పట్టించుకోలేదు.. ఇది కంపార్ట్‌మెంట్ వారికి చికాకుగా మారటంతో టీసీకి ఫిర్యాదు చేశారు.
ఇది చాలా రైళ్లలో జరుగుతున్న తంతే.. రిజర్వ్ చేసుకున్న బెర్త్‌లో వేళాపాళా లేకుండా ప్రయాణికులు పడుకుంటుండటంతో లోయర్‌బెర్త్‌ను సీటింగ్‌కు వాడుకోవటం ఇబ్బందిగా మారుతోంది. దీనిపై కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులొస్తుండటంతో స్పందించిన రైల్వే బోర్డు.. దాన్ని నియంత్రించేందుకు రిజర్వేషన్ బోగీల్లో పడుకునే వేళలను తాజాగా సవరించింది. ఇకపై రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించేవారు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకే నిద్రపోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మిగతా వేళల్లో మిడిల్ బెర్త్‌ను మడిచి లోయర్‌బెర్త్‌లో కూర్చోవటానికి వీలు కల్పించాలని.. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని అన్ని జోనల్ కార్యాలయాలకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసింది. బోగీల్లోని టీసీలు ఈ బాధ్యతను పర్యవేక్షించాలని.. వీటిపై ఫిర్యాదులొస్తే వెంటనే స్పందించాలని పేర్కొంది. అలాగే వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులను ఈ నిబంధన నుంచి మినహాయించింది. వారి శారీరక సమస్యల దృష్ట్యా సాధారణ వేళల్లోనూ పడుకునేందుకు బెర్తులు వినియోగించుకోవచ్చని పేర్కొంది.
పాత సమయంలో గంట కోత..
నిజానికి పడుకునే సమయాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు బెర్తుల్లో పడుకోవచ్చని, ఆ తర్వాత సీటింగ్‌కు వీలుగా మార్చాలని సమయపాలన ఆదేశాలు బోర్డు జారీ చేసింది. కానీ అది ఎక్కడా అమలు జరగటం లేదు. అలాంటి సమయపాలన ఉందని చాలా మందికి తెలియదు. ఫిర్యాదు చేసినా టీసీలు పట్టించుకునేవారు కాదు. అదో సమస్యగా భావించలేదు. కానీ ఇంతకాలానికి బోర్డు దృష్టిసారించింది. పాత సమయాల్లో గంట కోతపెట్టడమే కాకుండా.. కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
10కి ముందు పడకేసినా.. 6 తర్వాత పడుకునే ఉన్నా..
బెర్త్‌లకు సంబంధించిన ఫిర్యాదులు సగటున 30 వరకు రికార్డవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదులు రాకుండా.. కంపార్ట్‌మెంట్‌లలో గొడవ పడుతున్న సందర్భాలు కోకొల్లలు. సాధారణంగా లోయర్ బెర్త్‌లో ముగ్గురు కూర్చుంటారు. పడుకునే వేళకు ఇద్దరు మిడిల్, అప్పర్ బెర్తుల్లోకి చేరుకుంటారు. కానీ లోయర్ బెర్త్ ప్రయాణికులు తొందరగా పడకేస్తే మిగతా ఇద్దరు గత్యంతరం లేక పైబెర్తుల్లోకి చేరుకోవాల్సి వస్తోంది. ఇక సైడ్ బెర్తుల విషయానికొస్తే.. దిగువ బెర్త్ వారు మధ్యాహ్నము కూడా పడుకునే కిటీకీల్లోంచి బయటకు చూసుకుంటూ కాలక్షేపం చేస్తుండటంతో పై బెర్తు వారు పైనే కూర్చోవాల్సి వస్తోంది. కూర్చునే వెసలుబాటులేక టీ కూడా తాగలేకపోతున్నామని, భోజనం చేయలేక ఇబ్బంది పడుతున్నామంటూ వందల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి. తాజాగా అన్ని జోన్లకు ఆదేశాలు అందటంతో వెంటనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. లోయర్, మిడిల్, సైడ్ లోయర్ బెర్తుల్లో రాత్రి 10కి ముందు పడకేసినా, ఉదయం 6 తర్వాత పడుకునే ఉన్నా టీసీలకు ఫిర్యాదు చేయొచ్చు.