అకాల వర్షాలతో నలుగురి మృతి
తిరువనంతపురం/న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో కేరళ ఉత్తర తీరం వద్ద ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా గురువారం దక్షిణాదిన పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల రాకకు ముందే ఈదురు గాలులతో విరుచుకుపడ్డ అకాల వర్షాల తాకిడికి కేరళలో ఇద్దరు, తమిళనాడులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మళప్పురంలో ఒకరు, తిరువనంతపురంలో ఒక మహిళ మరణించినట్లు కేరళ అధికారులు తెలిపారు. తమిళనాడు నీలగిరి జిల్లాలో చెట్లు విరిగి పడటంతో తేయాకు తోటల్లో పనిచేసే ఇద్దరు మహిళలు మరణించారు. కేరళలోని ఎర్నాకుళం జంక్షన్‌లో రైలు పట్టాలు నీటమునగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా రూ.110 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు కేరళ రెవెన్యూ మంత్రి ఆదూర్ ప్రకాశ్ తెలిపారు.
కోచి విమానాశ్రయంలో అత్యధికంగా 191.6 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అకాల వర్షాలకు భూతాపోన్నతే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అకాల వర్షాల కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేరళ ఉత్తర తీరం వద్ద నుంచి మహారాష్ట్ర వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.